Sobhita Dhulipala On Nepotism: హిందీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల వరుస సినిమాలతో కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ABP Ideas of India ఈవెంట్ లో పాల్గొని మాట్లాడింది. సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేకున్నా... ఎలా వచ్చిందో వెల్లడించింది. సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


ఆడిషన్ అనేది PH టెస్ట్ లాంటిది- శోభిత


“సినిమా పరిశ్రమలో నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేరు. సొంతంగా నేనే ఈ రంగంలోకి వచ్చాను. మిస్ ఇండియా కాంపిటీషన్ తర్వాత ముందుగా యాడ్స్ లో నటించే అవకాశం వచ్చింది. మోడల్ గా చాలా ఆడిషన్స్ కు వెళ్లాను. క్లాసికల్ డ్యాన్సర్ అయిన నేను ఎక్స్ ప్రెషన్స్ కూడా బాగానే ఇచ్చేదాన్ని. సినిమాల పట్ల ఆసక్తి ఉండేది. సినిమా అవకాశాల కోసం కూడా చాలా ఆడిషన్స్ కు వెళ్లాను. ఇప్పటి వరకు ఏకంగా 600లకు పైగా ఆడిషన్స్ లో పాల్గొన్నాను. నా దృష్టిలో ఆడిషన్ అనేది PH టెస్ట్ లాంటిది. సినిమాలో ఆయా పాత్రలకు ఎంత మేరకు సూట్ అవుతారు ఆడిషన్స్ లో పరీక్షిస్తారు. అందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు” అని వెల్లడించింది.


“ఏ రంగంలోనైనా స్టార్టింగ్ లో ఇబ్బందులు తప్పవు. నేను యాడ్స్ లో నటించే సమయంలో చాలా మంది హేళన చేసే వాళ్లు. అందంగా లేనని, తెల్లగా లేనని, ఆ యాడ్స్ లో నటించేందుకు నేను సూట్ కానని ముఖం మీదే చెప్పే వాళ్లు. అయినా నేను ఏనాడు నిరాశ చెందలేదు. నా దృష్టిలో అందం అనేది ఆలోచన మాత్రమే అనుకున్నాను. నన్ను చూసి ప్రేక్షకులు ఏమనుకుంటారో అనే విషయాన్ని పట్టించుకునేదాన్ని కాదు. అందం గురించి ఆలోచించడం మానేసి... కొత్తగా, క్రియేటివ్ గా ఎలా నటించాలి? అని ఆలోచించేదాన్ని. చేస్తున్న పని మీద బాగా ఫోకస్ పెట్టేదాన్ని. ఆ శ్రద్ధ నాకు ఎంతో ఉపయోపడింది. ఈ రోజు సినిమా పరిశ్రమలో రాణించేందుకు కారణం అయ్యింది. కమర్షియల్ సినిమాల్లోనే నటించాలి అనే ఆలోచన మానేసి... వచ్చిన ప్రతి సినిమా ఆడిషన్ కు వెళ్లాను. తొలి ఆడిషన్‌ నుంచి ఇప్పటి వరకు ఒకేలా కష్టపడుతున్నాను” అని శోభిత వెల్లడించింది.


టాలెంట్ ఉంటేనే రాణిస్తారు- శోభిత


సినిమా పరిశ్రమలో నెపోటిజం మీద శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో నెపోటిజం బాగా ఉండేదని నేను భావించాను. కానీ, అది తప్పని తెలుసుకున్నాను. ఇండస్ట్రీలో బాగా రాణించాలంటే చక్కటి నటన ఉండాలి. నటన బాగుంటే ఉంటే కచ్చితంగా అవకాశాలు వస్తాయి. మంచి ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన కరీనా కపూర్ ను, నన్ను ఒకే వేదికపై అంతే గౌరవంగా చూస్తున్నారు అంటే దానికి కారణం నటన మాత్రమే అని భావిస్తాను” అని చెప్పింది.



Read Also: సోనుసూద్ హోటల్ బిల్లు పే చేసిన అజ్ఞాత అభిమాని, లెటర్‌లో ఏం రాశాడంటే?