Vikram: లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan), మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) నటిస్తున్న ‘విక్రమ్’ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాపై మార్కెట్లో వినిపిస్తున్న మరో వార్త ఈ అంచనాలను మరింత పెంచేలాగే ఉంది. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను స్టార్ గ్రూప్ ఏకంగా రూ.112 కోట్లు చెల్లించి కొనుగోలు చేసిందని వార్తలు వస్తున్నాయి.


కేవలం నాన్ థియేట్రికల్ బిజినెస్‌తోనే ఈ సినిమా బడ్జెట్ పూర్తిగా రికవరీ కానుందని తెలుస్తోంది. అంటే థియేట్రికల్ బిజినెస్ ద్వారా వచ్చే మొత్తం పూర్తిగా లాభమే అన్నమాట. ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా రూ.50 కోట్ల రేంజ్‌లో అమ్ముడుపోయినట్లు సమాచారం.


కేవలం తమిళనాట మాత్రమే కాక... దేశవ్యాప్తంగా ఈ సినిమాపై బీభత్సమైన క్రేజ్ ఉంది. మాస్టర్ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం...  కమల్ హాసన్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ వంటి నటులు ఉండటంతో ప్రకటించిన రోజు నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.


మేలో విడుదల?


ఈ సంవత్సరం మేలో విక్రమ్ విడుదల కానుందని తెలుస్తోంది. ఏప్రిల్ నెలాఖరు వరకు పెద్ద సినిమాలు అన్నీ లైనప్ అయి ఉండటంతో మే విడుదల అనేది కచ్చితంగా మంచి ఆప్షన్. ప్రస్తుతానికి మేలో ఉన్న పెద్ద సినిమా సర్కారు వారి పాట మాత్రమే. వీలైనంత త్వరగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే... కనీసం ఒకట్రెండు వారాల పాటు ఫ్రీ రన్ దొరికే అవకాశం ఉంటుంది.


అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి గిరీష్ గంగాధరన్ కెమెరామన్‌గా వ్యవహరిస్తున్నారు. కాళిదాస్ జయరామ్, నరైన్, ఆంథోని వర్గీస్, అర్జున్ దాస్, శాన్వీ శ్రీవాస్తవ, ఒకప్పటి హీరోయిన్ మహేశ్వరి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.