ICC t20 rankings : టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) దుమ్మురేపుతున్నాడు. ఐసీసీ టీ20 ర్యాకింగ్స్‌లో (ICC T20 Rankings) దూసుకుపోతున్నాడు. లంకేయులపై వీర విహారం చేసిన అతడు ఏకంగా 27 ర్యాంకులు మెరుగై 18వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు విరాట్‌ కోహ్లీ (Virat Kohli) టాప్‌-10 నుంచి బయటకొచ్చాడు.


ఈ మధ్యే ముగిసిన శ్రీలంక టీ20 సిరీసులో శ్రేయస్‌ అయ్యర్‌ విధ్వంసకరంగా ఆడాడు. ఓపెనర్లు విఫలమైన ప్రతిసారీ జట్టుకు అండగా నిలబడ్డాడు. వికెట్లు నిలబెట్టేందుకు నిలకడగా ఆడటమే కాకుండా అవసరమైనప్పుడు గేర్లు మార్చి దంచికొడతాడు. 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన ఈ సిరీసులో 174 స్ట్రైక్‌రేట్‌తో 204 పరుగులు చేశాడు. విరాట్‌ కోహ్లీ లేని లోటు తీర్చేశాడు. దాంతో బ్యాటింగ్‌ జాబితాలో ఒక్కసారిగా 27 స్థానాలు ఎగబాకేశాడు. ఇక స్వల్ప విరామం తీసుకున్న కోహ్లీ 15వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.


టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) 2 ర్యాంకులు తగ్గి 13వ ర్యాంకులో ఉన్నాడు. గాయంతో జట్టుకు దూరమైన లోకేశ్ రాహుల్‌ (KL Rahul) ఒక ర్యాంకు తగ్గి పదో స్థానానికి పరిమితం అయ్యాడు. ఇక భువనేశ్వర్‌ కుమార్‌ (Bhuvaneshwar Kumar) మూడు స్థానాలు మెరుగు పర్చుకొని  17వ ర్యాంకుకు చేరుకున్నాడు. రెండో టీ20లో 75 పరుగులు చేసిన పాథుమ్‌ నిసాంక ఆరు ర్యాంకులు ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్‌ క్రికెటర్లు బాబర్‌ ఆజామ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ తొలి రెండు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.


ఐసీసీ టీ20 బ్యాటర్స్‌ ర్యాంకింగ్‌


బాబర్‌ ఆజామ్‌
మహ్మద్‌ రిజ్వాన్‌
అయిడెన్‌ మార్‌క్రమ్‌
డేవిడ్‌ మలన్‌
డేవాన్‌ కాన్వే
ఆరోన్‌ ఫించ్‌
రసివాన్‌ డర్‌ డుసెన్‌
మార్టిన్‌ గప్తిల్‌
పాథుమ్‌ నిసాంక
కేఎల్‌ రాహుల్‌