యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘భార‌తీయుడు 2’.  అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్, ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందుతోంది. కమల్, శంకర్ కాంబినేష‌న్‌లో 1996లో విడుద‌లై, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిన ‘ఇండియన్’ చిత్రాన్ని ‘భార‌తీయుడు’గా తెలుగులో విడుదల చేశారు. ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘భార‌తీయుడు 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీసెంట్ గా విడుదలైన ఇంట్రో గ్లింప్స్‌ సినిమాపై ఓ రేంజిలో అంచనాలను పెంచేసింది.   


విజయవాడలో ‘భారతీయుడు 2’ షూటింగ్


తాజాగా ఈ సినిమా షూటింగ్ విజయవాడలో కొనసాగుతోంది. తాజా షెడ్యూల్‌ సుమారు 10 రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయవాడలో పలు లొకేషన్స్ ను దర్శకుడు ఫిక్స్ చేశారు. ఈ షూటింగ్‌లో కమల్‌ హాసన్‌ తో పాటు కీలక నటీనటులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనున్నట్లు సమాచారం.  విజయవాడ షెడ్యూల్‌ తర్వాత వైజాగ్‌లో కూడా కొన్ని రోజుల పాటు షూటింగ్‌ జరపనున్నట్లు టాక్ నడుస్తోంది.


కీలక పాత్రలు పోషిస్తున్న ప్రముఖ నటులు


ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నది. రకుల్‌ ప్రీత్‌ సింగ్, బాబీ సింహా, సిద్ధార్థ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ర‌వివ‌ర్మ‌న్  సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ‘భారతీయుడు 2’  చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేస్తున్నారు.  భారీ బ‌డ్జెట్‌, హైటెక్నిక‌ల్ వ్యాల్యూస్‌తో ‘భార‌తీయుడు 2’ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సుభాస్క‌ర‌న్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా  నిర్మిస్తున్నారు.  


కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్


‘భారతీయుడు 2’ షూటింగ్ కోసం విజయవాడకు వచ్చిన కమల్ హాసన్,  దివంగత సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్‌, పెద్ద సంఖ్యలో కృష్ణ అభిమానులు పాల్గొన్నారు. తన తండ్రి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్ కు మహేష్ బాబు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు.  “విజయవాడలో కృష్ణ గారి విగ్రహ ప్రతిష్టాపన జరగడం నిజంగా సంతోషంగా ఉంది. గర్వంగానూ ఉంది. ఈ వేడుకలో పాల్గొన్న కమల్ హాసన్ గారికి, దేవినేని అవినాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేసిన ప్రతి ఒక్క అభిమానికి పేరు పేరునా ధన్యదాలు” అని ట్వీట్ చేశారు.






గతేడాది నవంబర్ లో కృష్ణ కన్నుమూత


గతేడాది నవంబర్ 15న నటుడు కృష్ణ కన్నుమూశారు. వయోభారంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సుమారు 5 దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగారు. వందల సినిమాల్లో నటించారు. చక్కటి నటనతో సినీ అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.


Read Also: ‘జ‌పాన్’ కోసం కార్తీ ఇంత కష్టపడ్డారా- ఆకట్టుకుంటున్న మేకింగ్‌ వీడియో


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial