పెద్ద సినిమాల రిలీజ్ ఉన్నప్పుడు చిన్న సినిమాలకు పోటీగా దిగడానికి ధైర్యం చేయవు. డబ్బింగ్ సినిమాల సంగతి చెప్పనక్కర్లేదు. కానీ ఓ సినిమా మాత్రం ఏకంగా మెగాస్టార్ సినిమాతో పోటీకి దిగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'ఆచార్య'. ఏప్రిల్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనికి పోటీగా ఓ డబ్బింగ్ సినిమా రాబోతుంది. 


విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్ 28న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. 'కాతువాకుల రెండు కాదల్' అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగు 'కన్మణి రాంబో ఖతీజా' అనే పేరుతో విడుదల చేయబోతున్నారు. ఇది డబ్బింగ్ సినిమాఅయినప్పటికీ .. స్టార్ కాస్ట్ కు లోటు లేదు. 


విజయ్, నయన్, సామ్ లకు తెలుగునాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనిరుధ్ మ్యూజిక్, విఘ్నేష్ శివన్ దర్శకత్వం ఈ సినిమాపై హైప్ ను పెంచాయి. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు అన్నీ ఓ రేంజ్ లో ఉన్నాయి. కానీ 'ఆచార్య' సినిమాతో పోల్చుకుంటే ఈ డబ్బింగ్ సినిమాకు ఏ మేరకు థియేటర్లు దొరుకుతాయో చెప్పలేని పరిస్థితి. మరి ఏ ధైర్యంతో మేకర్లు మెగాస్టార్ సినిమాతో పోటీకి దింపుతున్నారో తెలియడం లేదు. ఎక్కువ శాతం థియేటర్లలో 'ఆచార్య'నే ఉంటుంది. చిరుతో పోటీకి దిగి ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి!


Also Read: ఆ గాయం మానడానికి ఆరు నెలలు పట్టింది! - సమంత