ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్‌ పై  నడిగర్‌ సంఘం బహిష్కరణ వేటు వేసింది. ఎన్నికల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఈ నిర్ణయం తీసుకుంది.  2019లో జరిగిన ఈ సంఘం ఎన్నికల్లో కె.భాగ్యరాజ్‌ అధ్యక్షుడు శంకర్‌ దాస్‌ పేరుతో ఓ జట్టు, నటుడు నాజర్‌ అధ్యక్ష  పాండవర్‌ జట్లు బరిలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున  అవకతవకలు జరిగాయనే విమర్శలు వచ్చాయి. కొద్ది రోజులు ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొంత మంది చెన్నై హైకోర్టులో కేసు వేశారు. కోర్టు ఆదేశాలతో ఎన్నికల  కౌంటింగ్‌ ఆగిపోయింది. అయితే, ఇదే అంశానికి సంబంధించి నాజర్‌ జట్టు రీ పిటీషన్‌ వేసింది.


చాలాకాలం హైకోర్టులో ఈ కేసు విచారణ కొనసాగింది. చివరకు నడిగర్ సంఘం ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని సంచలన తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో నాజర్ టీమ్ సంఘం బాధ్యతలు చేపట్టింది. వెంటనే కె. భాగ్య రాజ్ పై చర్యలకు ఉపక్రమించింది. సంఘానికి నష్టం కలిగేలా  భాగ్యరాజ్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో ఆయనపై బహిష్కర వేటు వేసింది. అతనితోపాటు మరో నటుడు ఏఎల్ ఉదయ్‌ను 6 నెలల పాటు బహిష్కరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఈ బహిష్కరణపై నటుడు ఉదయ్ కీలక విషయాలు వెల్లడించారు. తొలుత తనకు సంఘం నుంచి నోటీసులు వచ్చినప్పుడే షాక్ అయినట్లు వెల్లడించారు. తనతో పాటు తమిళ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భాగ్యరాజ్ ను తొలగించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. నడిగర్ సంఘం తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఉదయ్ తెలిపారు. ప్రత్యక్షంగా సంఘం ముందుకు వెళ్లి వివరణ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. తనను తొలగించడం పెద్ద విషయమేమీ కాకపోయినా, భాగ్యరాజ్ ను తొలగించడం ముమ్మాటికీ సంఘం చేసిన క్షమించరాని తప్పన్నారు. నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేసినందుకే ఈ ప్రతీకార్య చర్యలకు పాల్పడుతున్నట్లు ఉదయ్ ఆరోపించారు.


నడిగర్ సంఘం చేస్తున్న తప్పులను ఎత్తి చూపే వారిని బహిష్కరించడం నైతికం కాదని ఉదయ్ వెల్లడించారు. శరత్ కుమార్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సభ్యులపై ఏనాడు చిన్న చర్య కూడా తీసుకోలేదని గుర్తించాలన్నారు. ప్రస్తుతం సంఘం బాధ్యతలు నిర్వహిస్తున్న వారు అధికారం చేపట్టిన వెంటనే ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడ్డం సహించరాని విషయం అన్నారు. ఇప్పుడే ఇలా చేస్తే.. మున్ముందు మరెలాంటి ఘన కార్యాలు వెలగబెడతారోనని ఉదయ్ విమర్శించారు. సంఘం ఈ బహిష్కరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉదయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ విడుదల చేశారు.






Also Read : 'ఆదిపురుష్' టీజర్ పై ట్రోల్స్ - ట్రెండింగ్‌లో 'Disappointed' హ్యాష్ ట్యాగ్!



Also Read : వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్