KCR Plan : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారు. భారత రాష్ట్ర సమితి అనే పేరకే ఆయన మొగ్గు చూపుతున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్‌లో ఢిల్లీలో బహిరంగసభ పెడుతున్నారు. మరో ఏడాదిలో తెలంగాణలో పీఠాన్ని నిలబెట్టుకోవాల్సిన అత్యంత కఠినమైన ఎన్నికలను ఎదుర్కొంటూండగా.. కేసీఆర్ ఎందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు ? తెలంగాణలో పట్టు కోల్పోతే దేశంలో ఎవరూ పట్టించుకోరని తెలియదా ? కేసీఆర్ తాజా అడుగుల వెనుక అసలు వ్యూహం ఏమిటి ?
తెలంగాణపై దృష్టి కేంద్రీకరించాల్సిన సమయం !
రాజకీయాల్లో ఎవరికైనా ప్రాధాన్యం వారికి ఉన్న బలాన్ని బట్టే వస్తుంది. ప్రజాబలం ఎంత ఉన్నదన్నది ఎవరూ పట్టించుకోరు. అధికారం ఉందా..చట్టసభల్లో బలం ఉందా అన్నదే ముఖ్యం. కేసీఆర్ రెండు సార్లు తెలంగాణ నుంచి గెలిచి సీఎం అయ్యారు కాబట్టి ప్రాధాన్యం లభిస్తోంది. ఆయన మాటలకు విలువ లభిస్తోంది. మూడో సారి కూడా ముఖ్యమంత్రి అయితే తిరుగు ఉండదు. దేశ వ్యాప్తంగా మంచి ఇమేజ్ వస్తుంది. కానీ అధికారం కోల్పోతే మాత్రం మాజీ సీఎంలలో ఆయన ఒకరిగా మిగిలిపోతారు. అంతే కాదు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరగాల్సిన పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతినడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తేనే ఆరు నెలల తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధంచడానికి అడ్వాంటేజ్ లభిస్తుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ పూర్తి స్థాయిలో తెలంగాణపై దృష్టి సారించాల్సిన సమయమని చెప్పుకోవచ్చు.
కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో ఉండరంటే ప్రజలు ఎలా స్పందిస్తారు !?
కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి ఇతర రాష్ట్రాల్లో బహిరంగసభలకు ప్లాన్ చేస్తున్నారు. ఓ సారి జాతీయ పార్టీ పెడితే ఇక తెలంగాణపై దృష్టి సారించడం కష్టమే. తెలంగాణ పార్టీని కేసీఆర్ పట్టించుకోవడం లేదన్న భావన పెరిగితే అటు క్యాడర్‌లో నిర్లక్ష్యం ప్రారంభమవుతుంది. అదే సమయంలో కేసీఆర్ ఇక తెలంగాణ రాజకీయాల్లో ఉండరన్న అభిప్రాయం ప్రజల్లో బలపడితే మొదటికే మోసం వస్తుంది. అది అసలు మంచి సందేశం కాదు. కేసీఆర్ అంటే తెలంగాణ ... తెలంగాణ అంటే కేసీఆర్ అనేలా ఎప్పుడో ప్రజల మనసుల్లో ముద్రపడిపోయింది. ఇప్పుడు దాన్ని కాదని వేరే ప్లాన్ అమలు చేయాలనుకోవడం సాహసమే అనుకోవచ్చు.
అసలు కేసీఆర్ పొలిటికల్ ప్లాన్ ఇక్కడే అమలు !
ఇవన్నీ కేసీఆర్‌కు తెలియవా అంటే.. తెలియకుండా ఎలా ఉంటాయి. ఆయన దేశంలో సీనియర్ మోస్ట్ లీడర్లలో ఒకరు. అంతే కాదు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నేత. ఇంత చిన్న లాజిక్‌ను ఎలా మిస్సవుతారని మనం ప్రశ్నించుకోవచ్చు. కానీ మరి ఇలా ఎందుకు చేస్తున్నారంటే అసలు సమాధానం మాత్రం ఎంతో లోతుగా ఆలోచిస్తేనే కానీ తెలియదు. కేసీఆర్ జాతీయ పార్టీ ఎందుకంటే.. తెలంగాణలో మూడో సారి అధికారాన్ని చేపట్టడానికే. ఈ సమీకరణాల్లో చాలా క్లిష్టత ఉంటుంది. కానీ తరచి చూస్తే అదే నిజం.
కేసీఆర్ తప్ప ఇంకెవరూ కాదనేలా ప్రజల్ని ఏకతాటిపైకి తెచ్చే వ్యూహం !
తెలంగాణ బిడ్డ ఢిల్లీ పీఠానికి గురి పెడుతున్నాడు.. మద్దతివ్వరా ? అనేది కేసీఆర్ ప్రచార వ్యూహం కావొచ్చు. ఢిల్లీలో మోదీని కేసీఆర్ గురి పెడుతున్నారు. దేశాన్ని మారుస్తున్నా అంటున్నారు. జాతీయ పార్టీ పెడుతున్నారు. ఓ తెలంగాణ బిడ్డ ఇలా దేశంలో సంచలనం సృష్టించడానికి వెళ్తే సొంత ప్రజలు మద్దతివ్వరా ? అనే ఓ ఎమోషనల్ అప్పీల్ ప్రజలకు చేసే రాజకీయం ఇందులో ఉంది. నవ్వేటోడి ముందు జారిపడేలా చేయవద్దు అని కేసీఆర్ ఎక్కువగా చెబుతూంటారు.. ఇలాంటి వ్యూహంతోనే తనను ఓడించి తెలంగాణ పరువు తీయవద్దని.. మనం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించబోతున్నామని ప్రజల మైండ్ సెట్ మార్చే వ్యూహం ఈ ప్లాన్‌లో ఉందని.. రాజకీయ సమీకరణాలు లెక్కలన్నీ వేసుకున్న తర్వాత స్పష్టత వస్తుంది.
పదేళ్ల పాలన తర్వాత ప్రతి ప్రభుత్వంపై ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. దానికి కేసీఆరేం వ్యతిరేకత కాదు. రాష్ట్ర స్థాయిలో.. రాష్ట్ర అంశాలే ఎజెండాగా ఎన్నికలు జరిగితే ఆ వ్యతిరేకత బయటపడుతుంది. కానీ జాతీయ పార్టీగా.. జాతీయ అంశాలు.. కేసీఆర్ జాతీయ నేతగా మద్దతు అంశాల ప్రాతిపదికగా ఎన్నికలు జరిగితే ఎవరికి ప్రజల మొగ్గు ఉంటుందో ఎవరికైనా సులువుగా ఊహించవచ్చు. కేసీఆర్ అదే ప్లాన్ అమలు చేస్తున్నారు.