ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'(Adipurush). ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలారు. ఈరోజు టీజర్ ను రిలీజ్ చేశారు.
టీజర్ మొత్తం యానిమేషన్ తో నింపేశారు. లీడ్ క్యారెక్టర్స్ ను కార్టూన్ క్యారెక్టర్స్ మాదిరి చూపించారు. ఈ విషయంలో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయినట్లు ఉన్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా 'Disappointed' అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. యానిమేషన్ సినిమా చేస్తున్నట్లు ముందే చెప్పాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక టీజర్ లో కొన్ని షాట్స్ టెంపుల్ రన్ గేమ్ లోవి అంటూ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని పెట్టుకొని ఇలాంటి యానిమేషన్ సినిమా తీస్తారా..? అంటూ మండిపడుతున్నారు. రూ.500 కోట్ల బడ్జెట్ సినిమా వీడియో గేమ్ మాదిరి ఉందంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ పై ఇంకా వర్క్ చేయాలని.. దయచేసి ఇలా సినిమా రిలీజ్ చేయొద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఈ ట్రోల్స్ పై చిత్రబృందం స్పందిస్తుందేమో చూడాలి!
సంక్రాంతి కానుకగా... వచ్చే ఏడాది జనవరి 12న (Adipurush Release Date) ప్రపంచవ్యాప్తంగా త్రీడీలో 'ఆదిపురుష్' విడుదల కానుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. 'ఆదిపురుష్'కు ముందు, 'ఆదిపురుష్' తర్వాత అనేలా... జనవరి 12న దేశవ్యాప్తంగా శ్రీరామ నామ జపం వినిపించేలా సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి.
ఇకపై వరుసగా 'ఆదిపురుష్'కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. ఫారెన్ లో ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం దాదాపు రూ.250 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంటే.. పెట్టిన బడ్జెట్ లో సగమన్నమాట. డిజిటల్ రైట్స్ తోనే ఇంత మొత్తం వచ్చిందంటే.. ఇక థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందో చూడాలి!