జావా కంపెనీ తన సరికొత్త బైకును అందుబాటులోకి తెచ్చింది. 'జావా 42 బాబర్' పేరుతో సరికొత్త డిజైన్ తో ఈ బైక్ ను విడుదల చేసింది. సింగిల్ సీటర్ గా రిలీజ్ అయిన ఈ బైక్ వినియోగదారులను బాగా ఆకట్టుకుంటుంది. సింగిల్ సీట్ డిజైన్ అట్రాక్టివ్‌గా రైడర్ కు సరికొత్త అనుభవాన్ని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.


334 సీసీ ఇంజిన్


ఈ లేటెస్ట్ బైక్  334సీసీ ఇంజన్‌ కలిగి ఉంది. గరిష్టంగా 22.54 కిలో వాట్ల శక్తిని రిలీజ్ చేస్తుంది.   ఇంజన్ గరిష్టంగా 32.74Nm టార్క్‌ ను అందిస్తుంది. 6-స్పీడ్ గేర్‌ బాక్స్‌ తో పాటు సింగిల్ సిలిండర్ ఇంజన్‌ ను కలిగి ఉంది. సస్పెన్షన్ పరంగా, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌ లు ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABS సెటప్‌ తో డిస్క్ బ్రేక్‌ లు పని చేస్తాయని కంపెనీ తెలిపింది.  జావా 42 బాబర్ బైక్ రైడర్ కి మరింత సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని ఇచ్చేలా  అద్భుతమైన సస్పెన్షన్ సెటప్  అందిస్తుంది. అదే సమయంలో బ్రేకింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్ స్పోక్డ్ వీల్స్ ను కలిగి  ఉంటుంది. కొత్త రౌండ్ హెడ్‌ ల్యాంప్, ఇండిపెండెంట్ క్లాక్ కన్సోల్, కొత్త హ్యాండిల్ బార్, కొత్త ఫ్యూయల్ ట్యాంక్, పూర్తిగా రీడిజైన్ చేయబడిన అడ్జస్టబుల్ సీటు , వెనుక ఫెండర్‌పై చిన్న లగేజ్ ర్యాక్  కలిగి ఉంది. 


 రూ. 5 వేలతో బుక్ చేసుకోవాలి


బైక్ కావాలనుకునే వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా రూ. 5,000 చెల్లించి ముందస్తుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బైక్ ధర విషయానికి వస్తే  రూ.2.06 లక్షల నుంచి మొదలవుతుంది. ఆయా వేరియంట్ ను బట్టి రూ. 2.09 లక్షల వరకు ఉంటుంది. కొత్త జావా 42 బాబర్ మూడు విభిన్న రంగుల్లో  వినియోగదారులకు లభ్యమవుతుంది.  మూన్‌ స్టోన్ వైట్, మిస్టిక్ కాపర్, డ్యూయల్ టోన్ జాస్పర్ రెడ్.  కొత్త మోటార్‌సైకిళ్ల డెలివరీ వచ్చే వారం నుంచి ప్రారంభం అవుతుంది. టెస్ట్ రైడ్‌ల కోసం ఆయా మోడల్స్ సైతం వచ్చే వారం నుంచే అందుబాటులో ఉండనున్నాయి.


మా కంపెనీ నుంచి అత్యధిక అమ్ముకాబోయే బైక్!






ఇక ఈ బైక్ విడుదల సందర్భంగా  క్లాసిక్ లెజెండ్స్ CEO ఆశిష్ సింగ్ జోషి కీలక విషయాలు వెల్లడించారు.  “ఈ సరికొత్త 42 బాబర్ మాకు ఎన్నో విజయాలకు గుర్తు.  లేటెస్ట్  రెట్రో మోటార్‌సైకిల్‌  యువతలో బాగా క్లిక్ అవుతుంది.  మా కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌లలో ఒకటిగా మారబోతుంది. పెరాక్‌తో  దేశంలో సరికొత్త 'ఫ్యాక్టరీ కస్టమ్' విభాగాన్ని సృష్టించాము. దాని ప్రజాదరణ, అభిమానుల ఫాలోయింగ్ ఇప్పటికీ తగ్గలేదు. కొత్త 42 బాబర్​ను మేము విలక్షణమైన, స్టైలిష్, కస్టమ్ మోటార్‌సైకిల్‌ను కోరుకునే విస్తృత రైడర్‌ల కోసం అందుబాటులోకి తెచ్చాం" అని వెల్లడించారు.