టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమయం వచ్చిన ప్రతిసారీ పవన్ కళ్యాణ్ మీద ప్రేమని కురిపిస్తూనే ఉంటారు. దేవర అని పవన్ కళ్యాణ్ ని బండ్ల గణేష్ ముద్దుగా పిలుచుకుంటారు. ప్రస్తుతం పవన్ 'హరిహర వీర మల్లు' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి క్రేజీ అప్ డేట్ ని చిత్ర బృందం చెప్తూ సెట్స్ లో పవన్ ఉన్న ఫోటోస్ పంచుకున్నారు. అందులో పవన్ చాలా యంగ్ గా సూపర్ లుక్లో కనిపించారు. ఆ లుక్ కి ఫ్యాన్స్ మాత్రమే కాదు బండ్ల కూడా ఫిదా అయిపోయారు.
"అబ్బబ్బ మా బాస్ ను చూస్తుంటే గుండెల్లో దడ దడ మొదలయ్యింది. రక్తం ఉరకలేస్తుంది.. ఇప్పుడు ఒక్క ఛాన్స్ వస్తే? వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా.. అబ్బ ముద్దొస్తున్నావ్ బాస్" అని ట్వీట్ చేస్తూ పవన్ లేటెస్ట్ ఫోటో పోస్ట్ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా 'తీన్‌మార్', 'గబ్బర్ సింగ్' సినిమాలు నిర్మించారు బండ్ల గణేష్.
హరి హర వీర మల్లు సినిమాకు సంబంధించి దర్శక నిర్మాతలు ఒక వీడియోని విడుదల చేశారు. అక్టోబర్ మధ్య వారం నుంచి సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ వీడియోలో పవన్ లుక్ అదిరిపోయింది. లైట్ గా గడ్డంతో కనిపిస్తున్నారు. 'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Aggerwal) కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి(Nargis Fakri) కీలక పాత్రలో కనిపించనున్నారు.
మెగా సూర్య ప్రొడక్షన్స్(Megaproductions) పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాని 2023 మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్'(Bhavadeeyudu Bhagath singh) సినిమా చేయాలి. ఇవి కాకుండా తమిళ రీమేక్ 'వినోదయ సీతమ్' కూడా పవన్ ఒప్పుకున్నారు. సముద్రఖని ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో పవన్ తో పాటు సాయిధరమ్ తేజ్ కూడా నటించనున్నారు. మూడు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని పవన్ టార్గెట్ గా పెట్టుకున్నారు.
Also Read: దసరా కానుక సిద్ధం చేసిన నాని- 'దసరా' సినిమా నుంచి క్రేజీ అప్ డేట్