Jayaprakash Narayan On Movies: ప్రస్తుతం వస్తున్న సినిమాల మీద లోక్ సత్తా అధినేత జయ ప్రకాష్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మితిమీరిన హింస, ద్వేషం సమాజానికి చేటు కలిగిస్తుందన్నారు. ఈ రోజుల్లో వస్తున్న సినిమాలను చూస్తుంటే తన లాంటి వారికి కూడా కత్తి తీసుకుని నరకాలి అనేంత కసి కలుగుతుందన్నారు. ఇలాంటి సినిమాలను చిన్న పిల్లలు చూస్తే ఏమైపోతారోననే భయం కలుగుతుందన్నారు. సినిమాల ద్వారా సమాజం మీద  తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సినిమాలతో దేశానికి ముప్పు తప్పదన్నారు.  


సినిమాలు జనాల్లో కసి, హింసను పెంచకూడదు- జేపీ


“సినిమాల వల్ల మనుషులు మారరు. సినిమాల వల్ల మనుషులు చెడిపోరు. కానీ, ఫిల్మ్ మేకర్స్ కు కొంత బాధ్యత కూడా ఉంటుందని గుర్తించాలి. వారు సమాజానికి ఒక మార్గాన్ని చూపించాలి. ఆలోచన వక్రమార్గం పట్టకుండా జాగ్రత్త పడాలి. సరైన దిశగా వెళ్లేలా సూచించాలి. ఆ ప్రయత్నం భారత స్వాత్రంత్ర్య పోరాటంలో జరిగింది. సినిమాలు, సాహిత్యం, నాటకాలు, గేయాలు, ఆ రోజు సమాజంలో ఉన్న స్థితిగతులను ప్రతిబింబించి ప్రజల్లో చైతన్యాన్ని పెంచాయి. అందరిలోనూ జాతీయ భావాన్ని పెంపొందించాయి. హేతుబద్దమైన ఆలోచనలు కలిగించేలా చేశాయి. కానీ, ఇప్పటి సినిమాలు ఎంటర్ టైన్మెంట్ ప్రధానంగా రూపొందుతున్నాయి. ఎంటర్‌టైన్మెంట్ కావాలి. తప్పులేదు. దానితో పాటు సమాజానికి సంబంధించిన అంశాలను జత చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కనీసం సినిమాల్లో హింసా, ద్వేషాలను తీసేస్తే మంచిది. కొన్ని సినిమాలను చూస్తుంటే ఒక్కొక్కళ్లను నరకాలి అనిపిస్తుంది. నాకు చాలా భయం కలుగుతుంది. సినిమాలను ఏరకంగా చూపించినా ఫర్వాలేదు గానీ, నరకాలి అన్నట్లు చూపిస్తుంటే నాకు భయమేస్తుంది” అన్నారు.


ప్రజాస్వామ్యంలో హింసతో దేనికీ పరిష్కారం దొరకదు- జేపీ


అటు ‘శివ’, ‘యానిమల్’ లాంటి సినిమాలపై జేపీ సీరియస్ కామెంట్స్ చేశారు. ఇలాంటి సినిమాలతో ప్రజల్లో హింస భావన రేకెత్తుతుందన్నారు. “అప్పట్లో ‘శివ’ అనే సినిమా వచ్చింది. చాలా అద్భుతంగా తీశారు. నాగార్జున హీరోగా, రామ్ గోపాల్ వర్మ తీశారు. నా లాంటి వారికి కూడా ఆ సినిమా చూస్తుంటే కసి వస్తుంది. చిన్న పిల్లలు ఇలాంటి సినిమాలు చూస్తే ఏమైపోతారోనని భయం కలుగుతుంది. అందుకే సినిమాల ద్వారా చేతనైనంత వరకు సమాజంలో ఆలోచన పెంచే ప్రయత్నం చేయండి. మనుషుల బలహీనతను ఆసరాగా చేసుకుని హింస, కసి, ద్వేషాన్ని పెంచకండి. హింస అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాస్వామ్యంలో పరిష్కారం కాజాలదు. నాలుగు చాచి కొడితే పరిష్కారం వస్తుందనే భావన ప్రజల్లోకి తీసుకెళ్తే దేశాన్ని సర్వనాశనం చేస్తున్నట్లే” అని జేపీ తేల్చి చెప్పారు. ‘యానిమల్’ మూవీపై పార్లమెంట్ లోనూ చర్చ జరిగింది. ఇలాంటి సినిమాలు సమాజానికి నష్టం కలిగిస్తాయనే విమర్శలు వచ్చాయి. 


Read Also: హ్యాపీ బర్త్ డే వెంకటేష్ - వెంకీమామ మన అందరివాడు, ఈ ప్రత్యేకతలు ఆయనకే సొంతం


Read Also: డర్టీ పోటీ ఉండకూడదు - ‘డుంకీ’ రిలీజ్‌పై ‘సలార్’ నిర్మాత కామెంట్స్