దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ సినిమా జపాన్ లో రిలీజ్ చేశారు. విడుదల అయిన తొలిరోజే సినిమా కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించింది. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం జపాన్ లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా జపాన్ లో ఓ ఇంటర్వ్యూలో రాజమౌళికి ఆసక్తికరమైన సంఘటన ఎదురైంది. రాజమౌళి ని జపాన్ యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు రాజమౌళి ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి తెలియజేసింది. ఈ సినిమా అన్ని భాషల్లో గుర్తింపు తెచ్చుకొని భారీ వసూళ్లను కొల్లగొట్టింది. దీంతో ఈ సినిమాను విదేశీ భాషల్లోనూ విడుదల చేయాలని నిర్ణయించారు. ఇండియన్ సినిమాలకు జపాన్ లో మంచి డిమాండ్ ఉంది. అందులోనూ ఎన్టీఆర్ సినిమాలు ఇక్కడ మంచి టాక్ తెచ్చుకోడంతో ఆర్.ఆర్.ఆర్ సినిమాను జపాన్ లో విడుదల చేసారు. అందుకోసం చిత్ర బృందం కొన్ని రోజులుగా జపాన్ లో పాగా వేసి మరీ ప్రమోషన్స్ చేస్తున్నారు. రజనీ కాంత్ లాంటి హీరోల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు కూడా జపాన్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఎన్టీఆర్ మొదటి సారి జపాన్ వెళ్లడంతో ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. కొంతమంది ఫ్యాన్స్ ఎన్టీఆర్ ను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. అంతేకాదు కాదు ఎన్టీఆర్ జపనీస్ భాషలో మాట్లాడి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు కూడా.
అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఓ జపాన్ యూట్యూబర్ ఇంటర్వ్యూలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడగడంతో రాజమౌళి చాకచక్యంగా సమాధానం చెప్పారు. మీ సినిమాల్లో లాజిక్ లేని సన్నివేశాలు ఎక్కవగా ఉంటాయి, నిజంగా అది ప్రాక్టికల్ గా కుదురుతుందా అని అడిగితే.. "సినిమాలో అన్నీ సాధ్యమే. ప్రేక్షకులను ఎంగేజ్ చేయాలంటే అలాంటి యాక్షన్ సీన్స్ ఉండాలి, అందుకే స్క్రిప్ట్ రాసేటప్పుడే సీన్స్ అలా రాసుకుంటాను. నా సినిమాలో ప్రధాన లక్ష్యం ప్రేక్షకులను సంతృప్తి పరచడం" అని బదులిచ్చారు. సినిమా చివర్లో వచ్చే సాంగ్ లో ఎందుకు మహాత్మా గాంధీ లేరు అని యూట్యూబర్ అడిగిన ప్రశ్నకూ ఆయన ఇలా బదులిచ్చారు "మహాత్మగాంధీ చాలా గొప్ప వ్యక్తి. ఆయన శాంతి ద్వారా దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. కానీ అంతకంటే ముందు ఎంతోమంది స్వాతంత్ర్యమ్ కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయారు. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి వారు చిన్న వయసులోనే పోరాడి చనిపోయారు. సినిమాలో కూడా హీరో స్వాతంత్య్రం కోసం పోరాడతాడు కాబట్టి అలా పోరాడి అమరవీరులైన పోరాటయోధుల్ని ఆ పాటలో చూపించాం" అని బదులిచ్చారు. ఇప్పుడీ ఇంటర్వ్యూ చూసిన వాళ్లంతా దీని వెనక ఇంత అర్థం ఉందా అని కామెంట్స్ పెడుతున్నారు. మొత్తంగా ఆర్.ఆర్.ఆర్ హవా జపాన్ లోనూ కొనసాగుతోందని తెలుస్తోంది. మరి ఈ సినిమా అక్కడ ఎన్ని కోట్లు కొల్లగొడుతోందో చూడాలి.