Minister KTR : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుల వృత్తులను ప్రోత్సహించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కుల వృత్తుల వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. వైన్‌ షాపుల్లో గీత కార్మికులకు 15 శాతం రిజర్వేషన్‌ కల్పించామని తెలిపారు. గౌడన్నలకు చెట్ల పన్నును రద్దు చేశామన్నారు. కల్లు డిపోలతో ఏర్పాటు చేసి గౌడన్నలకు అండగా నిలిచామని స్పష్టం చేశారు. పేదలకు పింఛన్లను రూ.200 నుంచి రూ.2016 కు పెంచామని తెలిపారు. గీత కార్మికులకు రూ.2016 పింఛన్ అందిస్తు్న్నామని స్పష్టం చేశారు. ఆడ బిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలతో లక్ష చొప్పున సాయం చేస్తున్నామన్నారు.  గీత కార్మికులకు మోపెడ్‌లు అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.


ప్రతీ గ్రామంలో మౌలిక సదుపాయాలు 


రైతులకు రైతుబంధు, రైతు బీమాతో సహా అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ తాగు నీరు అందిస్తున్నామని మంత్రి అన్నారు. గురుకుల పాఠశాలల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 975 గురుకుల పాఠశాలలు పెట్టి ఆడబిడ్డలను ఉన్నత విద్య అందిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో నర్సరీ, ట్రాక్టర్‌, నీళ్లు, కరెంటు ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.  అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయని, కానీ కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో కరెంట్ కష్టాలు ఉండేవని, సీఎం కేసీఆర్‌ అధికారం చేపట్టినప్పటి నుంచి కరెంట్‌ సమస్య పరిష్కారమైందని తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిందన్నారు.  


లెటర్స్ ఉద్యమం


తెలంగాణ మంత్రి కేటీఆర్ లెటర్స్ ఉద్యమానికి పిలుపునిచ్చారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు లక్షలాది ఉత్తరాలు రాయాలని సూచించారు. మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రధాని మోదీకి పోస్టుకార్డు రాశారు. చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధించిన ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని పోస్టు కార్డు ద్వారా కోరారు. చేనేత కార్మికుల సమస్యలను పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన లేదని కేటీఆర్‌ తెలిపారు. చేనేత సమస్యలపై సీఎం కేసీఆర్‌ కూడా పలుమార్లు ప్రధానికి స్వయంగా లేఖలు రాశారని కేటీఆర్ గుర్తుచేశారు. 


పన్ను విధించిన తొలి ప్రధాని మోదీ 


దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేత ఉత్పత్తులపై పన్ను విధించిన తొలి ప్రధాని మోదీ అని మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమ పథకాలను కేంద్రం రద్దుచేసిందన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో జాతిని ఏకతాటిపై నడిపించిన చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధాని మోదీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ మహాత్ముని సూత్రాలు, స్వదేశీ మంత్రం, ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రకటనలు చేసే కేంద్ర ప్రభుత్వం తమ విధానాల్లో మాత్రం ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది ఉపాధి కల్పిస్తున్న టెక్స్ టైల్ రంగంలో చేనేత కార్మికులు కీలకమన్నారు.  దేశ సాంస్కృతిక సారథులైన చేనేత కార్మికులపై విధించిన పన్నును రద్దు చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. చేనేత కార్మికుల పట్ల ప్రేమ ఉన్న ప్రతీ ఒక్కరూ పోస్టు కార్డు ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.