పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఎంతో ప్రేమ ఉంటుంది. వారిని సంతోషంగా ఉంచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. జపాన్ లోనూ ఓ తండ్రి కూడా తన కొడుకు కోసం అలాంటి పనే చేశాడు. ఏకంగా ఓ సినిమా మొత్తాన్ని ఈజీగా అర్థం అయ్యేలా బొమ్మల పుస్తకంగా రూపొందించాడు. దాన్ని తన కొడుకుకు ఇచ్చి ఆనందంలో మునిగిపోయాడు. ఇంతకీ ఆయన ఏ సినిమాను బొమ్మల పుస్తకంగా మార్చారో తెలుసా? దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ మూవీని.


బొమ్మల పుస్తకంగా ‘RRR’ సినిమా


జపాన్ కు చెందిన ఓ వ్యక్తికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. ఆ పిల్లాడికి ‘RRR’ సినిమా అంటే ఎంతో ఇష్టం. కానీ, మూడు గంటల సేపు సబ్ టైటిల్స్ తో సినిమా చూడాలంటే కొడుకుకు చాలా కష్టం అవుతుంది. ఎలాగైనా తన కొడుకు ఈజీగా సినిమాను అర్థం చేసుకోవాలి అనుకున్నాడు. ఎలా చేస్తే అర్థం అవుతుంది? అని బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ‘RRR’ సినిమా మొత్తాన్ని బొమ్మల పుస్తకం రూపంలో తయారు చేయాలి అనుకున్నాడు. ఆలస్యం చేయకుండా ఆ సినిమా అంతటిని బొమ్మల పుస్తకంగా రూపొందించాడు. ఒక పేజీలో బొమ్మలు, పక్క పేజీలోనే ఆ బొమ్మలకు సంబంధించిన వివరణ ఇస్తూ సినిమా అంతటిని పుస్తకంగా మార్చాడు. ఈ బుక్ ప్రస్తుతం జపాన్ లో అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. అంతేకాదు, ఎవరికైనా ఈ బుక్ కావాలంటే.. మరికొన్ని కాపీలు తయారు చేసి ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. 






’RRR’ సినిమా పట్ల మీ ప్రేమ మా మనసును తాకింది!


ఈ పుస్తకం గురించి తాజాగా ‘RRR’ టీమ్ కు తెలిసింది.  బుక్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. “’RRR’ సినిమా పట్ల మీకున్న ప్రేమ మా మనసును తాకింది. ఈ పుస్తకం మీ అబ్బాయికి తప్పకుండా నచ్చి ఉంటుందని భావిస్తున్నాం. ఇది మాకు చాలా ప్రత్యేకం” అంటూ ట్వీట్ చేసింది.  






ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటిన ’RRR’


రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. సుమారు రూ. 500 కోట్లతో రూపొందించిన ఈ సినిమా దేశ విదేశాల్లో బ్లాక్ బస్టర్ సాధించింది. జపాన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు సాధించింది. వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1200 కోట్లు వసూలు చేసింది. అంతర్జాతీయ అవార్డుల వేదికపైనా సత్తా చాటుతోంది. గోల్డెన్ గ్లోబ్ సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది.


Read Also: ‘RRR’కు మరో ప్రతిష్టాత్మక అవార్డు - ఈసారి ఏ కేటగిరికి వచ్చిందో తెలుసా?