సోషల్ మీడియా ద్వారా సినిమా తారలకు తరచుగా ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. వారి పోస్టులకు అనుచితంగా కామెంట్స్ పెట్టడంతో పాటు వీడియోలు, ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల సైట్లలో పోస్టు చేయడం వరకు రకరకాలుగా వేధింపులకు గురవుతూనే ఉంటారు. ఇప్పటికే మార్ఫింగ్ ఫోటోల ద్వారా చాలా మంది సెలబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కూడా చేరింది. టీనేజ్ లో తన మార్ఫింగ్ ఫోటోలను అశ్లీల వెబ్ సైట్లలో చూసి షాకైనట్లు వెల్లడించింది.
అశ్లీల వెబ్ సైట్ లో నా ఫోటోలు చూసి షాకయ్యా- జాన్వీ
2018లో జాన్వీ కపూర్ సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ‘ధడక్’ సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై దర్శనం ఇచ్చింది. ఆమె రీసెంట్ గా ‘మిలీ’ మూవీలో కనిపించి అలరించింది. చివరి సారిగా వరుణ్ ధావన్ తో కలిసి ‘బవాల్’ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం సౌత్ పై ఫోకస్ పెట్టింది. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ అనే సినిమా చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన తల్లిదండ్రులకు సినిమా పరిశ్రమలో ప్రముఖులుగా గుర్తింపు ఉండటంతో చిన్నప్పటి నుంచే ఫోటోలు, వీడియోలు తన జీవితంలో ఓ భాగం అయినట్లు జాన్వీ కపూర్ వెల్లడించింది. డిజిటల్ యుగంలో అవే ఫోటోలు, వీడియోలు తనపై తీవ్ర ప్రభావం చూపించాయని తెలిపింది. “కెమెరాలు నా జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. నా చిన్నప్పటి నుంచే నాతో పాటు నా చెల్లి ఖుషీ కపూర్ ఫోటోలను కూడా తీసేవారు. మా అనుమతి లేకుండానే ఫోటోలు తీసుకునేవారు. ఆ ఫోటోలను కొంత మంది దుర్వినియోగం చేసే వారు. ఓసారి మా ఫోటోలను మార్ఫింగ్ చేసి కొన్ని అశ్లీల సైట్లలో ఉంచారు. మేము వాటిని చూసి షాక్ అయ్యాం. ప్రస్తుతం డిజిటల్ యుగంలో మార్ఫింగ్ ఫోటోల బెడద మరింత ఎక్కువ అయ్యింది. ప్రజలు కూడా సదరు ఫోటోలను నిజమైనవిగానే నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితి నిజంగా ఆందోళనకరం” అన్నారు.
నా ఫోటోలు చూసి ఫ్రెండ్స్ హేళన చేశారు- జాన్వీ
తనకు 10 ఏండ్ల వయసు ఉన్నప్పుడే ఇంటర్నెట్ లో తన ఫోటోలు కనిపించాయని జాన్వీ కపూర్ చెప్పింది. స్కూల్ లో చదువుతున్న రోజుల్లోనే యాయూ హోమ్ పేజీలో తన ఫోటోలు ఉన్నట్లు తెలిపింది. ఓ రోజు కంప్యూటర్ ల్యాబ్ లో ఫ్రెండ్స్ నా ఫోటోలు చూసి, సినిమాల్లోకి వెళ్తున్నావా? అని అడిగారని చెప్పింది. ఆ సమయంలో తాను చాలా ఇబ్బందిగా ఫీలైనట్లు వెల్లడించింది. అంతేకాదు, నువ్వు సినిమాల్లో రాణించేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదంటూ ఎగతాళి చేసినట్లు గుర్తు చేసుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న AI కారణంగా మార్ఫింగ్ ఫోటోల బెడద మరింత పెరిగిపోయే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం జాన్వీ పలు చిత్రాల్లో నటిస్తోంది. రాజ్‌కుమార్ రావుతో కలిసి ‘మిస్టర్ & మిసెస్ మహి’, జూనియర్ ఎన్టీఆర్‌తో ‘దేవర’, రోషన్ మాథ్యూ, గుల్షన్ దేవయ్య కలిసి ‘ఉలాజ్’ చిత్రాల్లో యాక్ట్ చేస్తోంది.
Read Also: బాక్సాఫీస్ దగ్గర తగ్గిన ‘స్కంద’ జోరు, తొలి రోజుతో పోల్చితే సగానికిపైగా పడిపోయిన కలెక్షన్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial