జ్ఞానంబ వాళ్ళు కొత్త చిన్న ఇంట్లోకి దిగుతారు. షర్ట్ తగిలించుకోవడానికి కూడా హ్యాంగర్ లేని ఇల్లు కూడా ఒక ఇల్లేనా అని అఖిల్ కోపంతో రగిలిపోతాడు. జానకిని అఖిల్ తిడుతుంటే జెస్సి తనకి సపోర్ట్ గా మాట్లాడుతుంది. తను ఏంటో నీకు సొంత అక్క అన్నట్లు మాట్లాడుతున్నావ్ ఏంటి? అప్పు చేసి అన్న హీరో అయితే నేను జీరో అయ్యాను. రోడ్డు మీదకి వెళ్తే అందరూ చేతకాని తమ్ముడి కోసం అప్పు చేసి మోసపోయాడని అంటున్నారని చిందులు తొక్కుతాడు. జెస్సి మాత్రం జానకిని వెనకేసుకొస్తుంది. జానకి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటుంటే మల్లిక బయటకి వస్తుంది. తనని బయట చూస్తే పనులు చెప్తారని అనుకుంటుంది. జానకి ఫ్యామిలీ ఫోటో శుభ్రంగా తుడిచి గోడకి తగిలిస్తుంది.
Also Read: మల్లిక పప్పులు ఉడకలేదు- కష్టాల్లో భర్తకి తోడుగా నిలిచిన జానకి
జానకి ఒక్కతే పనులు చేసుకుంటూ కష్టపడుతుంది కాస్త సాయం చేయొచ్చు కదా అని గోవిందరాజులు మల్లికని పిలుస్తాడు. కానీ తనకి ఓపిక లేదని ఏదేదో వాగుతుంది. జానకి ఇల్లంతా శుభ్రంగా సర్ది పెడుతుంది. కొత్త ఇంట్లోకి కావాల్సినవి కొన్ని సరకులు రామా తీసుకొస్తాడు. చెప్పిన సరకులు కొన్ని తీసుకురాలేదేంటి అని అడుగుతుంది డబ్బులు లేవని చెప్పేసరికి జానకి మాట మార్చి సర్ది చెప్తుంది. వాళ్ళ మాటలు విన్న జెస్సి చాలా బాధపడుతుంది. పాలు పొంగించడానికి రమ్మని జానకి జ్ఞానంబని పిలుస్తుంది. అలాంటి మంచి పనులు నీ చేతులతో నువ్వే చెయ్యి అని జ్ఞానంబ బాధగా అంటుంది. జరిగినది మర్చిపోయి పాలు పొంగించమని గోవిందరాజులు అంటాడు.
జ్ఞానంబ మాత్రం అందుకు ఒప్పుకోదు. మీ చేతులతోనే పాలు పొంగించమని జెస్సి కూడా అడుగుతుంది. కానీ జ్ఞానంబ మాత్రం నా అవసరం ఉండాల్సిన చోట లేనప్పుడు ఇక్కడ ఉన్నా లేనట్టే అనేసి వెళ్ళిపోతుంది. సందు దొరికినప్పుడల్లా ఇంట్లో నుంచి వెళ్లిపోదామని మల్లిక అంటుంది. జానకి చేతుల మీదగానే పాలు పొంగించమని గోవిందరాజులు అంటాడు. జ్ఞానంబ దేవుడి ముందు వెలిగించిన దీపంతో జానకి స్టవ్ వెలిగించి పాలు పొంగిస్తుంది. మంచి ఆలోచన చేశారు అమ్మ చేత్తోనే పాలు పొంగిచ్చినట్టు ఉందని రామా అంటాడు. అదంతా చాటుగా జ్ఞానంబ చూస్తుంది. అందరూ వెళ్లిపోగానే రామా జానకిని హగ్ చేసుకుని ముద్దు పెట్టేస్తాడు.
Also Read: వేద, యష్‌తో అన్యోన్య దాంపత్య వ్రతం చేయిస్తున్న రాజా- ఇద్దరు ఒక్కటి అవుతారా?
ఇంట్లో పని నుంచి తప్పించుకునేందుకు మల్లిక తలనొప్పిగా ఉందని జారుకుంటుంది. కడుపు ఉందని అప్పుడు పనులు చేయకుండా తప్పించుకున్నా, ఇప్పుడు అబార్షన్ పేరు చెప్పి మరోసారి తప్పించుకుంటున్నా అని చంకలు గుద్దుకుంటుంది మల్లిక. అప్పుడే పాలు తీసుకుని జానకి వస్తుంది. తనని చూసి లేని నొప్పులు ఉన్నట్టు నటిస్తుంది. అసలు నీకు కడుపు వచ్చిందనే మాటే అబద్ధం మళ్ళీ ఈ ఓవర్ యాక్షన్ అవసరమా అని జానకి అంటుంది.