తెల్లారితే ఏం జరుగుతుందా అని జ్ఞానంబ బాధపడుతుంది. ఇల్లంటే నీడ మాత్రమే కాదు ఆ కుటుంబాన్ని ముందుకు నడిపించే ధైర్యం కూడా. మనం రోడ్డున పడకుండా అమ్మవారు ఆదుకుంటుందని ఎదురుచూస్తున్నా అని అంటుంది. ఈ వయస్సులో ముగ్గురు కొడుకులు, కోడళ్ళని తీసుకుని ఏ పంచన చేరాతాం అని ఆందోళనపడుతుంది. రామా వెళ్ళాడు కదా డబ్బులు తీసుకొస్తాడని గోవిందరాజులు ధైర్యం చెప్తాడు. జానకి రామా కోసం ఇంటి బయట అలాగే ఎదురు చూస్తూ నిద్రపోతుంది. చికిత వచ్చి లేపుతుంది. కంగారుగా వెళ్ళి జానకి మళ్ళీ రామాకి ఫోన్ ట్రై చేస్తుంది కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది.


Also Read: సామ్రాట్ ఎప్పుడో తన భర్త అయ్యాడన్న తులసి- నందుని సత్తు రూపాయిగా కూడా పనికి రావన్న లాస్య


జానకి వచ్చి రామా ఫోన్ ఆఫ్ అని వస్తుందని కంగారుపడుతుంది. మల్లిక వచ్చి మొహం చూపించలేక ఎటైనా పారిపోయారెమో అని దెప్పిపొడుస్తుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా రాముడు బంగారం అని గోవిందరాజులు అంటాడు. డబ్బులు సర్దుబాటు అయ్యాయో లేదో భాస్కర్ రావు వస్తే ఏం సమాధానం చెప్పాలి అని విష్ణు అంటూ ఉండగా వడ్డీ వ్యాపారి అడుగుపెట్టేస్తాడు. డబ్బులు రెడీ అయ్యాయా లేదా అని భాస్కర్ రావు జ్ఞానంబని అడుగుతాడు. రామా దిగాలుగా అప్పుడే ఇంటికి వస్తాడు. డబ్బులు సర్దుబాటు అయ్యాయా అని ఆత్రంగా తండ్రి అడుగుతాడు. చాలా ప్రయత్నాలు చేశాను నాన్న వెళ్ళిన ప్రతిచోట ఇవ్వలేమనే చెప్పారు అని రామా బాధగా చెప్తాడు.


మీ స్వలాభం కోసం అప్పు చేసి బయటతిరిగొచ్చి డబ్బులు దొరకలేదని అంటే ఎలా నమ్ముతాము అని మల్లిక నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఉమ్మడి ఆస్తి వెనకేసుకొచ్చేంత చౌకబారు మనుషులం కాదని జానకి అంటుంది. డబ్బులు ఇవ్వకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని ముందే చెప్పాను ఇప్పుడు ఏం అంటారు అని భాస్కర్ నిలదీస్తాడు. ఇంకొంత గడువు ఇస్తే అప్పు తిరుస్తానని రామా అడుగుతాడు. కానీ కుదరదని ఇంట్లో అందరి మధ్య సఖ్యత లేనప్పుడు నేను మిమ్మల్ని నమ్మలేను. ఇల్లు నాకు అప్పగించి తీరాల్సిందే, జ్ఞానంబ మాట తప్పుతున్నారా అని భాస్కర్ నిలదీస్తాడు.


Also Read: వేద, యష్‌తో అన్యోన్య దాంపత్య వ్రతం చేయిస్తున్న రాజా- ఇద్దరు ఒక్కటి అవుతారా?


మీరు అన్నట్టుగా ఈ ఇల్లు ఇప్పుడే మీకు అప్పగిస్తున్నాం అని జ్ఞానంబ అనేసరికి అందరూ షాక్ అవుతారు. ఐదు లక్షలు ఇచ్చి తీసుకోమని చెప్తుంది. చిన్నబ్బాయి తీసుకున్న ఐదు లక్షలకి వడ్డీ మిగిలింది అందుకు గాను కారు ఉంచుకుంటున్నా. మీ స్వీట్ షాప్ కూడ రాసి ఇవ్వాలి. ఇంట్లో సామాన్లు అన్ని వదిలేసి వెళ్ళాలి అని భాస్కర్ అంటాడు. అదెలా ఇస్తామని రామా అడుగుతాడు. రూ.20 లక్షలకి నెలకి 40 వేలు వడ్డీ మొత్తం కట్టిన తర్వాత మీ షాపు ఇచ్చేస్తానని చెప్తాడు. అలా అని కాగితాల మీద రాయించుకుని సంతకాలు తీసుకుంటాడు. కుటుంబ భారం నీ భుజాల మీద మోస్తున్నావ్ అని సంతోషపడ్డాం ఆఖరికి ఇళ్లే పోయేలా చేశావ్ కదా అని విష్ణు అంటాడు. ఇలా అవుతుందని అనుకోలేదని రామా క్షమించమని అడుగుతాడు. స్వార్థం కోసం తాము ఏమి చూసుకోలేదని అదొక్కటి నమ్మమని రామా అడుగుతాడు. పరువు అయితే పోయింది కదా అని జ్ఞానంబ అంటుంది.