పోలేరమ్మ తిక్క కుదిర్చేలా చికెన్ తినే చిన్న కోడలిని పంపించమ్మా అని మల్లిక గట్టిగా కోరుకుంటుంది. అనుకున్నట్టుగానే ఒక కొత్త క్యారెక్టర్ సీరియల్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఆ అమ్మాయి చికెన్ లెగ్ పీస్ తింటూ దాని రుచిని ఆస్వాదించేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంది. అప్పుడే తనకి ఒక ఫోన్ రావడంతో వస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా వెనకే బైక్ మీద దొంగలు వచ్చి తన మెడలోని చైన్ కొట్టేసి పారిపోతూ ఉంటారు. వల్ల వెనక పడుతూ నా చైన్ కొట్టేసి పారిపోతున్నారు ఎవరైనా పట్టుకోండి అని అరుస్తూ ఉంటే అది మన జానకి కంట పడుతుంది. ఇంక శివంగిలా తన చేతిలోని క్యారేజీతో జానకి వాళ్ళని కొట్టి బైక్ మీద నుంచి కింద పడేలా చేస్తుంది. వెంటనే పక్కన ఉన్న కర్ర తీసుకుని వీరబాదుడు బాదేస్తుంది. తన దెబ్బలకి దొంగలు అక్కడ నుంచి పారిపోతారు. మట్టిలో పడిన తన చైన్ తీసి జానకి ఆ అమ్మాయికి ఇస్తుంది.


వాళ్ళు ఇద్దరు ఉన్నారు మీరు ఒక్కరే ఏదైనా తేడా వస్తే మీ ప్రాణాలకే ప్రమాదం అలాంటిది అంత రిస్క్  ఎలా చేశారని ఆ అమ్మాయి జానకిని అడుగుతుంది. మనల్ని భయపెట్టేది ఎదుటి వారి ధైర్యం కాదు మనలోని పిరికితనమే. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు ఎంత మంది ఉన్నారు అని కాదు చూడాల్సింది మనలో ఎదిరించగలిగే ధైర్యం ఉందని గుర్తించాలి. అప్పుడు సమస్య మనల్ని భయపెట్టడం కాదు మనంఏ సమస్యని భయపెడతాం అని జానకి చెప్తుంది. ఆ మాటలకి ఆ అమ్మాయి జానకిని తెగ పొగిడేస్తుంది. తన పేరు జెస్సి అని పరిచయం చేసుకుంటుంది.


చికెన్ బిర్యానీ కోసం మల్లిక సంబరంగా ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే జానకి, రామా బయటకి వెళ్తుంటే ఎక్కడికి అని అడుగుతుంది. ఐపీఎస్ కోచింగ్ కి వెళ్తున్నా అని చెప్తుంది. మరి పోలీసు డ్రెస్స్ వేసుకోలేదేంటి అని వెటకారంగా అడుగుతుంది. నిన్ను జానకి సొంత చెల్లెలిలాగా చూస్తుంది..తనని నువ్వు ప్రేమగా చూడకపోయిన పరవాలేదు కానీ తన చదువుకి హాని కలిగించేలా ఉదయం చేసిన పిచ్చి పనులు లాంటివి చెయ్యకు అని రామా హెచ్చరిస్తాడు.  అప్పుడే జ్ఞానంబ, గోవిందరాజులు బయట నుంచి ఇంటికి వస్తారు. ఇప్పుడు మనం వెళ్ళి వస్తున్న విషయం తెలిస్తే జానకి ఆనందానికి అవధులు ఉండవని గోవిందరాజులు అంటాడు.


రామా, జానకిని తీసుకుని వెళ్లబోతుంటే ఎక్కడికి వెళ్తున్నారని గోవిందరాజులు అడుగుతాడు. జానకి గారిని కోచింగ్ కి తీసుకెళ్తున్నా అని చెప్పడంతో జ్ఞానంబ వద్దు అని అంటుంది. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు. అంటే అమ్మా ఈరోజు వద్దని అంటున్నావా అని అడుగుతాడు. ఈరోజే కాదు ఏ రోజు వద్దని జ్ఞానంబ అనడంతో మల్లిక లోపల తెగ సంతోషపడుతుంది. అదేంటమ్మా జానకిగారు చదువుకోవడానికి ఒప్పుకున్నావ్ కదా అని రామా టెన్షన్ గా అడుగుతాడు. మీరు భలే ఉన్నారు బావగారు చీర చినిగిపోవడానికైనా మనసు మారడానికైన ఒక్క క్షణం చాలు అని మల్లిక అంటుంది. అత్తయ్యగారు చెప్పినట్టు మనం నడుచుకోవాలి, ఎలా వచ్చావో అలాగే లోపలికి వెళ్ళు అని మల్లిక చెప్తుంది. అదేంటమ్మా ఎందుకు వద్దంటున్నావని రామా అడిగితే ఆడపిల్లలు అర్థరాత్రి బయటకి వెళ్ళడం మంచిది కాదు అన్ని వేళలా మనకి అనుకూలంగా ఉండవు కదా అని అంటుంది. జానకికి తోడుగా నేను ఉంటాను కదా అంటే ఇప్పటి వరకు నువ్వు కొట్లో పని చేశావ్ మళ్ళీ ఇప్పుడు అంతదూరం రాజమండ్రి వరకు బండి మీద వెళ్తే నువ్వు అలిసిపోవా, రాత్రి పూట నీకు అసలు సరిగా నిద్ర పడుతుందా.. మీ భార్య భర్తలు ఇద్దరు ఏకాంతంగా సంతోషంగా గడపాల్సిన సమయం ఇది. ఈ సమయాన్ని రోజు ఇలా వెళ్ళి రావడానికి ఉపయోగిస్తారా ఇప్పటిదాకా కోల్పోయింది చాలు ఇంక కోల్పోతామంటే నేను అసలు ఊరుకొను అని జ్ఞానంబ చెప్తుంది.


అమ్మా మల్లిక నువ్వు మీ అత్తయ్య చదువుకోవద్దు అని చెప్పేసరికి తెగ పొంగిపోతున్నావనుకుంటా కాస్త ఆగమ్మా.. మీ అత్తయ్య రాత్రి పూట వద్దు పగటి పూట చదువుకోమని చెప్తున్నారని గోవిందరాజులు అనేసరికి మల్లిక కప్పలాగా నోరు తెరుస్తుంది. అవునా అమ్మా అని రామా అనడంతో అవునన్నట్టు జ్ఞానంబ తల ఊపుతుంది. నువ్వు చదువుకోవద్దు అన్నావని చాలా భయపడిపోయాను అని రామా అంటాడు. ఇప్పటికిప్పుడు అకాడమీలో అడ్మిషన్ దొరకడం అంటే చాలా కష్టం అని జానకి అంటే నీకు ఆ కంగారు అవసరం లేదని తెలిసిన వాళ్ళ ద్వారా మీ అత్తయ్య మాట్లాడేశారు రేపటి నుంచి నువు చదువుకోవడానికి వెళ్లొచ్చని వాళ్ళు చెప్పారని గోవిందరాజులు సంతోషంగా చెప్తాడు. ఆ మాటకి రామా, జానకి సంతోషంతో ఉబ్బితబ్బిబవుతారు.


Also Read: కాంచన గురించి ఇంట్లో చెప్పి మంట పెట్టిన మాళవిక- ఖైలాష్ ని యష్ విడిపిస్తాడా?


మనది ఉమ్మడి కుటుంబం జానకి చదువు కోసం లక్షలు లక్షలు ఖర్చు పెట్టడం ఎంత వరకు ధర్మం మీరే చెప్పండని మల్లిక అడుగుతుంది. నువ్వు ఈ విషయాన్ని అడుగుతావని దీన్ని అడ్డంపెట్టుకుని ఇంట్లో మనస్పర్ధలు సృష్టిస్తావని నేను ముందే ఊహించాను.. అందుకే ఎవరు ఈ విషయంలో వేలెత్తి చూపించే అవసరం లేకుండా ప్రభుత్వ సంస్థలో చదువుకునేందుకు మాట్లాడాను అనడంతో మల్లిక నోరెళ్ళబెడుతుంది. అక్కడ చదువుకోవడానికి ఎలాంటి ఖర్చు ఉండండి జ్ఞానంబ చెప్తుంది. మాట వరసకి అలా అడిగాను అంతే కానీ నాకు ఎలాంటి దురుద్దేశం లేడని అంటే గోవిందరాజులు కౌంటర్ ఇస్తాడు. 


Also Read: నీ మనసులో నా స్థానం ఏంటని ఆదిత్యని నిలదీసిన సత్య- తన బతుకులో తన పెనిమిటే ఉన్నాడని మాధవకి వార్నింగ్ ఇచ్చిన రుక్మిణి