పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు కాంట్రవర్సీలు కామన్.  రీసెంట్‌గా రిలీజై... బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న RRR విషయంలో కూడా అలాగే జరుగుతుంది. కథను వక్రీకరించారని.. హీరో కారెక్టర్లకు సమానమైన ప్రయారటీ లేదని తెలుగునాట గొడవ నడుస్తోంది. అయితే బాలీవుడ్‌లో ఓ కొత్త గాసిప్ గుప్పుమంటోంది. RRR రోల్‌పై ఆలియా అలిగింది అంటోంది  బాలీవుడ్‌ మీడియా.. నిజమేనా..?

 

"రాజమౌళి సినిమాలో ఒక్క క్షణం కనిపించే గెస్ట్ రోల్ దక్కినా చాలు... చేయడానికి నేను సిద్ధం" RRR రిలీజ్‌కు ముందు ఆలియా భట్ అనేక సందర్భాల్లో చెప్పిన మాట ఇది. RRR  రోల్ కోసం రాజమౌళి తనను సంప్రదించినప్పుడు.. చాలా సంబరపడిపోయానని.. స్టోరీ ఏంటో చెప్పకపోయినా.. ఈ మూవీ చేసి ఉండేదాన్నని ఆలియా ప్రమోషన్లలో కూడా చెప్పింది. అలాంటి ఆలియా RRR లో తన రోల్‌ను తగ్గించారని అలిగింది అంటున్నారు. తన పాత్ర నిడివిని ఎడిటింగ్‌లో తగ్గించడంపై ఆలియా అంత హ్యాపీగా లేదంటూ.. IANS న్యూస్ ఏజన్సీ ప్రచురించింది. అంతేకాకుండా.. RRR పోస్టులను ఇన్‌ స్టాగ్రామ్ నుంచి తీసేసిందని.. ఎస్.ఎస్.రాజమౌళి(Rajamouli)ని అన్‌ఫాలో కూడా చేస్తోందని ఆ ఏజన్సీ తెలిపింది. దీనినే జాతీయ సంస్థలు ప్రచురిస్తుండటంతో ఈ వివాదం కాస్తా ముదురుతోంది.

 

అయితే ఇది పూర్తిగా నిజం అనిపించడం లేదు.  అసలు ఆలియా ముందు నుంచి కూడా RRR ప్రమోషన్ తన ఇన్‌ స్టాగ్రామ్ హాండిల్‌ నుంచి చేయలేదు. ట్విటర్‌లో మాత్రం కొన్ని RRR అఫీషియల్‌ పోస్టులను రీట్వీట్ చేసింది అంతే. సినిమా ఎండ్‌ కార్డ్సులో వచ్చిన ఎత్తరా జెండా తెలుగు పాటను తను చివరిసారిగా ట్విటర్‌లో ప్రమోట్ చేసింది. అలాగే 'బ్రహ్మాస్త్ర'లో తన పాత్ర రివీల్ చేస్తూ వచ్చిన టీజర్‌పై రాజమౌళి స్పందించారు.. దానికి థాంక్స్ కూడా చెప్పింది. అసలు ఆలియా పోస్టులే పెట్టనప్పుడు.. వాటిని తొలగించిందన్న ప్రశ్నే లేదు. రాజమౌళిని అన్‌ఫాలో అవుతున్నారు అన్నదాంట్లోనూ వాస్తవం  కనిపించడం లేదు. ఎందుకంటే అలియా.. రాజమౌళిని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతుంది. అయితే ఈ అన్ ఫాలో వార్తలు వచ్చిన తరువాత నుంచి ఆమె రాజమౌళిని ఫాలో అవుతుందని చెబుతున్నారు.

 

ఇదిలా ఉండగా.. RRR రిలీజ్‌కు నాలుగు రోజుల ముందు.. బ్రహ్మాస్త్ర షూటింగ్‌ జరుగుతూ ఉండగా..  పబ్లిక్‌ RRR అని అరిస్తే.. అలియా కూడా అదే స్థాయిలో RRR అని అరుస్తూ.. వారిని ఉత్సాహపరిచింది. కాబట్టి ఏదో జరిగింది.. అనుకోవడానికి లేదు. ఇక అసలు వివాదానికి చెబుతున్న కారణం కూడా అంత కరెక్టుగా కనిపించడం లేదు. RRR లో వాళ్ల పాత్రల పరిధి మేరకే నిడివి ఉంది. ఈ విషయంతో జక్కన్న లెక్కలు చాలా పక్కాగా ఉంటాయి. సీనియర్‌ హీరో అయిన NTRకే పరిధి తగ్గింది అంటున్నారు. స్టోరీలో ఇమడనప్పుడు.. ఆయన పాత్రను పెంచే పరిస్థితే లేదు. పైగా ఇవన్నీ చెప్పే ఆలియాను తీసుకుని ఉంటారు. ఒకవేళ నిడివి తగ్గించినా ఆ విషయం ఆమెకు చెప్పే చేస్తారు. పాత్ర ఎంత సేపు ఉన్నది అని కాకుండా.. సినిమా కథను ముందుకు తీసుకెళ్లే ఒక లీడ్‌గా సీత కారెక్టర్ ఉంది. రామరాజు కారెక్టర్ ఎలివేషన్‌కు కానీ...రామ్- భీమ్ మధ్య బాండింగ్‌కు కానీ ఆలియా కారెక్టరే ముఖ్యం. కేవలం కొన్ని సీన్ల కోసం తాను నొచ్చుకుంటుంది.. అనుకోవడానికి లేదు.


అయితే.. RRR  వాయిదా పడటానికి ముందు.. జనవరిలో ఆలియా ప్రమోషన్లలో ఎక్కువుగా పాల్గొంది. నార్త్- సౌత్ తేడా లేకుండా అన్ని ఈవెంట్లలో కనిపించింది. కానీ మార్చికి ముందు మాత్రం రాజమౌళి, రామ్ చరణ్, NTR మాత్రమే కనిపించారు. బ్రహ్మాస్త్ర షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లే హాజరుకాలేదా.. మరేదైనా కారణమా అన్నది తెలీదు. ఒకవేళ నిజంగా అలాంటిది ఉంటే ఆగదు కాక.. ఇంకొన్ని రోజుల్లో అయినా బయటకు వస్తుంది.

Also Read: శ్రీరామనవమికి ప్రభాస్ ఫ్యాన్స్‌కు డ‌బుల్ ధమాకా! ఆ రోజు 'ఆదిపురుష్' అప్‌డేట్ ఏంటంటే?