Shubman Gill Century Orange Cap IPL 2023: ఈ సీజన్‌లోని రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ (GT), ముంబై ఇండియన్స్ (MI) మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఆటగాడు శుభ్‌మన్ గిల్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఆరెంజ్ క్యాప్ రేసులో ఫాఫ్ డు ప్లెసిస్‌ను వెనక్కి నెట్టాడు. ఈ సీజన్‌లో గిల్ ఆరెంజ్ క్యాప్ గెలవడం దాదాపు ఖాయం అయింది.
ఈ ఏడాది ప్రారంభం నుంచి శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాట్ మూడు ఫార్మాట్లలో సెంచరీని నమోదు చేశాడు. ఇది కాకుండా వన్డే క్రికెట్‌లో అతని బ్యాట్ నుంచి డబుల్ సెంచరీ కూడా వచ్చింది. 23 ఏళ్ల శుభ్‌మన్ గిల్ ఈ సీజన్‌లో గుజరాత్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక ఆటగాడిగా నిరూపించుకున్నాడు.
క్వాలిఫయర్ 2 మ్యాచ్‌కు ముందు శుభ్‌మన్ గిల్ 15 ఇన్నింగ్స్‌లలో 55.54 సగటుతో 722 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు శుభ్‌మన్ గిల్, ఫాఫ్ డు ప్లెసిస్ మధ్య తేడా కేవలం 8 పరుగులు మాత్రమే. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో గిల్ బ్యాట్ 3 సెంచరీలు సాధించింది.
ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మూడో అద్భుత సెంచరీ
రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌తో 129 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ కనిపించింది. దీంతో ఈ సీజన్‌లో 16 ఇన్నింగ్స్‌ల్లో 60.79 సగటుతో 851 పరుగులు చేశాడు. రెండో స్థానంలో ఉన్న డు ప్లెసిస్ 730 పరుగులతో ఉన్నాడు. తనకు ఇంకో మ్యాచ్ ఆడే అవకాశం లేదు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డెవాన్ కాన్వే ఈ లిస్ట్‌లో ఐదో స్థానంలో ఉన్నాడు. తను 625 పరుగులు చేశాడు. అతను గిల్‌ను అందుకోవడం అసాధ్యం. ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో సెంచరీ చేసిన ఏడో ఆటగాడిగా గిల్ నిలిచాడు. గతంలో మురళీ విజయ్, వీరేంద్ర సెహ్వాగ్, వృద్ధిమాన్ సాహా, షేన్ వాట్సన్, జోస్ బట్లర్, రజత్ పాటిదార్ ఈ ఘనత సాధించారు.
ఈ సీజన్‌లో శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు బ్యాట్‌తో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు మూడు సెంచరీలతో పాటు నాలుగు అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లు కూడా ఆడాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న ఫైనల్లో 123 పరుగులు చేస్తే 2016లో విరాట్ కోహ్లీ చేసిన 973 పరుగుల రికార్డును బద్దలు కొడతాడు.
129 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ సాయంతో ఇప్పుడు ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా శుభ్‌మాన్ గిల్ నిలిచాడు. గతంలో ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ 122 పరుగులతో మొదటి స్థానంలో, షేన్ వాట్సన్ 117 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు.
ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 132 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన లోకేష్ రాహుల్ ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో, గిల్ 129 పరుగుల ఇన్నింగ్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు.