దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. దేశ విదేశాల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డుల్లోనూ సత్తా చాటుతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కగా, తాజాగా రెండు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను అందుకుంది. ఉత్తమ విదేశీ చిత్రంతో పాటు, ఉత్తమ పాట కేటగిరీలో అవార్డులను అందుకుని తెలుగు సినిమా స్థాయిని ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లింది.


టీమిండియా ఆటగాళ్లను కలిసిన ఎన్టీఆర్


ఇక తాజాగా న్యూజిలాండ్ కోసం భాగ్యనగరానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లను ‘RRR’ హీరో జూ.ఎన్టీఆర్ ను కలిశారు. అమెరికా నుంచి భారత్ కు చేరుకున్న ఆయన పలువురు జట్టు సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కలిసిన టీమిండియా జట్టు సభ్యుల్లో  సూర్యకుమార్ యాదవ్,  శుభమన్ గిల్, ఇషాన్ కిషన్,  యుజ్వేంద్ర చాహల్ తో పాటు శార్దూల్ ఠాకూర్ ఉన్నారు.  అయితే, వీరంతా ఎక్కడ కలిశారనేది తెలియరాలేదు. బ్యాక్ గ్రౌండ్  బట్టి చూస్తే, ఓ కార్ల షోరూంలో మీట్ అయినట్లు తెలుస్తోంది. అటు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ‘RRR’ సినిమాలో ‘నాటు నాటు’ పాటకు రామ్ చరణ్ తో కలిసి జూ. ఎన్టీఆర్ ఎలా స్టెప్పులతో అదరగొట్టాడో, అలాగే  కివీస్ తో జరిగే మ్యాచ్ లోనూ భారత జట్టు అలాగే అదరగొట్టాలని కామెంట్స్ చేస్తున్నారు.






భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ కోసం ఏర్పాట్లు పూర్తి  


అటు ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్న ఇరు జట్లు ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. రేపు(బుధవారం) మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది.  


ఆస్కార్స్ లో ‘RRR’ సత్తా చాటేనా?


అటు త్వరలో జరగబోయే ఆస్కార్ అవార్డుల వేడుక కోసం సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘RRR’ సినిమా పలు విభాగాల్లో అవార్డుల కోసం పోటీ పడుతోంది. ఎన్ని కేటగిరీల్లో అవార్డులు అందుకుంటుందోనని ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు రావడంతో ఆస్కార్ కూడా వస్తుందని అందరూ భావిస్తున్నారు.    


Read Also: RRRను రెండుసార్లు చూసిన కామెరూన్ - రాజమౌళితో ఆయన ఏమన్నారో తెలుసా?