ఈ ఏడాది(2022) సౌత్ సినిమా పరిశ్రమకు చిరస్మరణీయ విజయాలను అందించింది. దక్షిణాది నుంచి తెరకెక్కిన ఎన్నో సినిమాలు దేశ వ్యాప్తంగా సంచలన విజయాలను అందుకున్నాయి. కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలు సత్తా చాటుకున్నాయి. ఈ ఏడాది పాన్-ఇండియన్ చిత్రాలకు అద్భుతంగా కలిసి వచ్చింది. తాజాగా IMDb ఈ సంవత్సరంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 భారతీయ చిత్రాల జాబితాను విడుదల చేసింది. తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలతో టాప్ ఫిల్మ్ లిస్టింగ్‌లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క హిందీ చిత్రంగా ‘కాశ్మీర్ ఫైల్స్’ నిలిచింది. IMDb ప్రకారం, ఈ జాబితాలో చోటు దక్కించుకున్న చిత్రాలు వెబ్ సైట్ లో నెలవారీ 200 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ అందుకున్నాయి.
అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 సినిమాల లిస్ట్ ఇదే..
1. RRR
అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 సినిమాల లిస్టులో ‘RRR’ టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే గోల్డెన్ గ్లోబ్స్ లో రెండు నామినేషన్లను పొందింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. డిజిటల్ ప్లాట్ ఫారమ్ లో విడుదలైన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ‘RRR’ దేశ విదేశాల్లోని ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది.
2. కాశ్మీర్ ఫైల్స్
దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘కాశ్మీర్ పైల్స్’ సినిమా.. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 1990లో కాశ్మీర్ నుంచి కాశ్మీరీ హిందువుల వలసల ఆధారంగా రూపొందించారు. అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
3. K.G.F: చాప్టర్ 2
ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన సినిమా ఇది. KGF చాప్టర్ 2 దేశంలోనే అతిపెద్ద బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. KGFకు కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా సినీ అభిమానులను ఎంతో అలరించింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. యష్ ప్రధాన పాత్రలో నటించి ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.
4. విక్రమ్
2018 ‘విశ్వరూపం-2’ తర్వాత కమల్ హాసన్‌ని మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చిన చిత్రం లోకేష్ కనగరాజ్ ‘విక్రమ్’. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని దక్కించుకుంది. కమల్ లోని కొత్త నటుడిని పరిచయం చేసింది.
5. కాంతార
చిన్న సినిమా విడుదలై దేశవ్యాప్తంగా పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా ‘కాంతార’. రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన ఈ సినిమా పాన్-ఇండియన్ హిట్ గా మారింది. ఈ చిత్రంలో నటనకు గాను రిషబ్.. సినీ ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కన్నడ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల చక్కటి విజయాన్ని నమోదు చేసింది.
6. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్
ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మాధవన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం.. అనేక భాషల్లో విడుదలైంది. ఇది కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ ప్రదర్శించబడింది.
7. మేజర్
అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ‘మేజర్’. 26/11 ముంబై దాడుల సమయంలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను శేష్ పోషించాడు. ఈ చిత్రం ఉన్నికృష్ణన్ బాల్యం నుంచి ముంబై దాడుల్లో మరణం వరకు జరిగిన సంఘటనలు అన్నింటిని చూపిస్తోంది. ప్రజల ప్రాణాలను రక్షించడానికి, తన ప్రాణాలను లెక్క చేయని ధీరత్వాన్ని ఇందులో చూపించారు.
8. సీతా రామం
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన ప్రేమకథా చిత్రం ‘సీతా రామం’ తెలుగులో అద్భుత విజయాన్ని అందుకున్న తర్వాత.. ఈ సినిమాను దేశ వ్యాప్తంగా డబ్బింగ్ వెర్షన్ విడుదల చేశారు. లవ్ స్టోరీ జానర్ ఈ రోజుల్లో పెద్దగా పాపులర్ కాకపోయినా, కథలో దమ్ముంటే ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని ఈ సినిమా నిరూపించింది.
9. పొన్నియిన్ సెల్వన్-1
దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తాజా సినిమా ‘పొన్నియిన్ సెల్వన్-1’. విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, కార్తీ, త్రిష కృష్ణన్, జయం రవి, శోభూత ధూళిపాళ సహా పలువురు దిగ్గజ నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. కల్కి నవలల సిరీస్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
10. 777 చార్లీ
రక్షిత్ శెట్టి, సంగీత శృంగేరి సహా పలువురు కీలక పాత్రలు నటించిన కన్నడ చిత్రం ’777 చార్లీ’. కిరణ్ రాజ్ కె రూపొందించిన ఈ సినిమా ఒక కుక్క, ఒంటరిగా ఉన్న ఫ్యాక్టరీ కార్మికుడి మధ్య బంధాన్ని చూపిస్తుంది. ఈ చిత్రం పరిమిత థియేటర్లలో విడుదలైంది. కానీ, విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో ఈ సంవత్సరంలో అత్యధికంగా మాట్లాడిన కన్నడ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
Read Also: బాలీవుడ్ సినిమాల పతనానికి కారణం వాళ్లే, దర్శకుడు రాజమౌళి సంచనల వ్యాఖ్యలు