తెలంగాణలో జరుగుతున్న SI ఈవెంట్స్ లో తల్లి కూతురు పాస్ కావడం విశేషంగా నిలిచింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన నాగమణి, ఆమె కూతురు ఎస్సై ఈవెంట్స్ లో పాసయ్యారు. నాగమణి గతంలో హోంగార్డుగా పనిచేస్తూ కానిస్టేబుల్ గా ఎంపికై ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం ములుగు జిల్లాలో పని చేస్తున్నారు. మెయిన్స్ కూడా పాస్ అయితే ఈ తల్లి కూతుర్లు ఎస్సైలు గా నియామకం అవ్వనున్నారు.
ఖమ్మం రూరల్ మండలం రామన్న పేట గ్రామంలో ఓ నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన నాగమణి.. విద్యార్థి దశనుంచే ఇటు చదువులోనూ, అటు క్రీడల్లోనూ రాణించేది. పాఠశాల, కళాశాల క్రీడల్లో రాష్ట్ర స్థాయి అవార్డులు ఎన్నో అందుకుంది. ఆర్థిక పరిస్థితులు, పైగా ఆడ పిల్ల కావడంతో తండ్రి పెళ్లి చేసి, అత్తారింటికి పంపించేశారు. అయినా నాగమణిలో మాత్రం తపన ఉండడంతో అంగన్ వాడి ఉద్యోగం సాధించింది. పోలీసు కావాలనే తన చిన్నప్పటి కోరిక మేరకు హోంగార్డు ఉద్యోగం సాధించింది. ఆ తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగం కూడా సాధించారు. ఇలా అంచెలంచెలుగా తన పట్టుదలతో ఎదిగింది. అయినా సంతృప్తి చెందని కానిస్టేబుల్ నాగమణి ఈ ఏడాది వచ్చిన ఎస్సై నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకొని, తన కూతురు త్రిలోకినితో కూడా దరఖాస్తు చేయించింది.
ప్రిలిమ్స్‌లో పాస్
ప్రిలిమ్స్ పరీక్షల్లో ఇద్దరూ నెగ్గడంతో తనకున్న అవగాహనతో గ్రౌండ్‌కు కూతురును తీసుకెళ్లి సాధన చేసేవారు. అదృష్టం కొద్దీ తల్లీకూతుళ్లకి ఒకే రోజు ఈవెంట్స్ కావడం, మళ్లీ ఒకే బ్యాచ్ రావడంతో పోటీ పడీ మరీ అర్హత సాధించారు. ఇది చూసిన అక్కడి పోలీసు అధికారులు, మిగతా అభ్యర్థులు కూతుర్ని మించిన తల్లి అని అభినందించారు. వీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నారు. ప్రస్తుతం నాగమణి ములుగు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ముగిసిన మహిళల దేహదారుఢ్య పరీక్షలు
హన్మకొండ కాకతీయ విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో జరుగుతున్న స్టయిఫండరీ ట్రైనీ కానిస్టేబుల్, సబ్-ఇన్స్పెక్టర్ల నియామకాల్లో భాగంగా ఈ నెల 10వ తేదీ నుండి మహిళా అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్యలు బుధవారం (డిసెంబరు 14) ముగిసాయి. ఉదయం 5 గంటల నుండి కేయూ మైదానానికి చేరుకున్న మహిళ అభ్యర్థినుల ధృవీకరణ పత్రాల పరిశీలన అనంతరం 800 మీటర్ల పరుగును నిర్వహించారు. ఈ పరుగులో అర్హత సాధించిన అభ్యర్థునులకు ఎత్తుతో పాటు లాంగ్ జంప్, షాట్ పుట్ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వీ. రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు.
నిన్న నిర్వహించిన మహిళ దేహదారుఢ్య పరీక్షల్లో 1,317 అభ్యర్థునులకుగాను 1,176 అభ్యర్థునులు హజరుకాగా ఇందులో 863 మంది అభ్యర్థునులు తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. అలాగే గత నాలుగు రోజులుగా మహిళలకు నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లో మొత్తం 4,784 మంది అభ్యర్థినులకు గాను 4,303 అభ్యర్థినులు హజరుకాగా ఇందులో 3,128 మంది అభ్యర్థునులు రాత పరీక్షకు అర్హత సాధించారు.
రేపటి నుండి వచ్చే నెల జనవరి 3వ తేది వరకు పురుష అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారని, ఈ పరీక్షలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఉద్యోగం వచ్చేందుకు సహయం చేస్తామని డబ్బు వసూళ్ళకు పాల్పడే కేటుగాళ్ళ పట్ల అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని, ఇలాంటి ఏవరైనా మిమ్మల్ని సంప్రదించినట్లయితే తక్షణమే వరంగల్ పోలీస్ కమిషనర్ సెల్ నంబర్ 9491089100 కు గాని అదనపు డీసీపీ సెల్ నంబర్ 9440795201కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వ్యక్తులు వివరాలు గోప్యంగా ఉంచుతారని పోలీస్ కమిషనర్ అభ్యర్థులకు సూచించారు.