మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని మూవీ సెట్‌లో విలేకరుల సమావేశంలో చిరంజీవితోపాటు రవితేజ, రాజేంద్రప్రసాద్, ఉర్వశి రౌతేలా, దర్శకుడు బాబీ తదితరులు పాల్గొన్నారు. ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. 


ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం నటీనటులు, సాంకేతిక సిబ్బంది చాలా శ్రమించారని తెలిపారు. ఈ మూవీలో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందన్నారు. బాబీ తన ప్రాణం పెట్టి తీసిన మూవీ అని కొనియాడారు. అనంతరం ఈ మూవీపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు చిరంజీవి సమాధానాలు చెప్పారు. 


ఎందులోనూ జోక్యం చేసుకోం


బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలను సంక్రాంతికే విడుదల చేయడం, ఈ రెండు సినిమాలకు నిర్మాతలు కూడా ఒకరే కావడంపై విలేకరులు పలు ప్రశ్నలు సంధించారు. దీనిపై చిరంజీవి స్పందిస్తూ.. ‘‘సినిమాకు నిర్మాతలు అనేవారు చాలా ప్రధానం. వారి సినిమాలో నటించిన తర్వాత మా పని పూర్తవుతుంది. ఆ తర్వాత మేం ఎందులోనూ జోక్యం చేసుకోం. ఆ నిర్మాత ఒకేసారి రెండు సినిమాలు నిర్మిస్తున్నారంటే.. రెండిటినీ కన్న బిడ్డలుగా భావిస్తారు. వారికి రెండూ సమానమే. రెండిటికీ న్యాయం చేయాలనే అనుకుంటారు. రెండు సినిమాలు బాగా ఆడాలనే కోరుకుంటారు’’ అని చిరంజీవి సమాధానం ఇచ్చారు. 


పవన్‌తో సినిమా, రెండేళ్లు పట్టవచ్చేమో


పవన్ కళ్యాణ్‌తో సినిమా ఎప్పుడనే ప్రశ్నకు చిరంజీవి బదులిస్తూ.. ‘‘ఏ హీరోతోనైనా కలిసి పనిచేయడానికి నేను సిద్దమే. పవన్ కళ్యాణ్ చాలా సినిమాలకు కమిట్ అయ్యాడు. ముందు అవి పూర్తికావాలి. సుమారు రెండేళ్లు పడుతుందేమో’’ అని చిరంజీవి అన్నారు. 28 ఏళ్ల తర్వాత మళ్లీ రవితేజాతో కలిసి పనిచేయడంపై స్పందిస్తూ.. అప్పుడు మేం ఎలా ఉన్నామో.. ఇప్పుడే అలా ఉన్నామన్నారు.


ఆ అవసరం లేదనప్పుడు రిటైర్డ్ అయిపోవాలి


మెగాస్టార్ స్థాయికి ఎదిగిన మీరు.. నీటిలో తడుస్తూ ఫైట్లు చేయాలా? మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో నటించాలా? ఆ అవసరం ఉందా అనే ప్రశ్నకు చిరంజీవి ఘాటుగా స్పందించారు. ‘‘ఆ అవసరం లేదు అనిపించిన రోజున రిటైర్డ్ అయిపోవడమే ఉత్తమం. ఇది నేను ప్రతి ఒక్కరికీ చెబుతా. మనం దేనికైనా కమిట్ అయినప్పుడు.. దానికి న్యాయం చేయాలి. బిగినింగ్ డేస్‌లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఈ ప్రశ్న ఎదురైతే.. స్టార్ డమ్ మామూలుగా రాదు.. కష్టపడితేనే వస్తుందని సమాధానం చెప్పేవాడిని. ఇప్పటికే అదే చెబుతా. ఇప్పుడు నేను కమిట్మెంట్‌తో చేస్తున్నప్పుడు అయ్యో పాపం అని సింపథీ చూపితే నచ్చదు. ఎప్పుడూ ఆకలితో ఉండాలి. అర్థాకలితో ఉండాలి. ఆకలి చచ్చిపోయిన రోజున ఇండస్ట్రీని వదిలేయాలి. నేను కేవలం షర్ట్ పీస్ వేసుకుని మైనస్ ఎనిమిది డిగ్రీల చలిలో నటించాను. ఐస్ షూస్ లోపలికి వెళ్లి కాళ్లు కమిలిపోయాయి. కానీ, ఆ బాధను వ్యక్తపరచలేను. గొడ్డులా కష్టపడతా. నేను కష్టపడి పనిచేస్తున్నప్పుడు నాకు బాధ ఉండదు. ఎందుకంటే.. ఆ సమయంలో నాకు అభిమానులు వావ్ అనిపించడం నాకు కళ్లల్లో కనిపిస్తుంది, చెవులకు వినిపిస్తుంది’’ అని చిరంజీవి సమాధానం ఇచ్చారు.


Also Read : మాస్ సినిమా చేస్తే 'కెజియఫ్' లాంటి సినిమా చేస్తా - ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ