మాస్... మ మ మాస్... ఊర మాస్... ప్రతి హీరో అటువంటి ఇమేజ్ కోరుకుంటారు. ప్రేమ కథలతో చిత్ర పరిశ్రమకు పరిచయమైనా సరే... విజయాలు వచ్చిన తర్వాత మాస్ సినిమా చేయాలని ప్రయత్నిస్తారు. మరి, ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) సంగతి ఏంటి? ఆయనకు మాస్ సినిమా చేయాలని ఉందా? అని అడిగితే... ''ఇప్పుడు మాస్ స్టోరీలు అంటే అర్థం మారింది. 'కెజియఫ్' వచ్చి అంతా మార్చేసింది. ఇప్పుడు అటువంటి సినిమాలే ఇప్పుడు మాస్‌కు నచ్చుతున్నాయి. నేను చేస్తే అటువంటి సినిమా చేస్తా. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను చేయను'' అని చెప్పారు.
'టాప్ గేర్' (Top Gear Movie) సినిమాను ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ అనుబంధ సంస్థ ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై కె.వి. శ్రీధర్ రెడ్డి నిర్మించారు. శశికాంత్ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆది సాయికుమార్ మీడియాతో ముచ్చటించారు. ఆయన మాటల్లో ఆ విశేషాలు...
హీరో క్యారెక్టర్ టాప్ గేరులో ఉంటుంది
''టాప్ గేర్'లో నేను క్యాబ్ డ్రైవర్ రోల్ చేశా. అతని జీవితంలో ఓ చిన్న సమస్య కాస్తా పెద్దదిగా మారుతుంది. అది ఏమిటన్నది ఆసక్తికరం. ఈ కథంతా ఒక్క రోజులోనే జరుగుతుంది. నాకు స్టోరీ, స్క్రీన్ ప్లే బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేసేశా. దీనికి ముందు 'టాప్ గేర్' టైటిల్ అనుకోలేదు. అయితే, హీరో కారెక్టర్ మాత్రం ఎప్పుడూ టాప్ గేరులోనే ఉంటుంది. కథానుగుణంగా ఓ సమయంలో అతను టాప్ గేర్ వేయాల్సి వస్తుంది. అందుకని, ఆ టైటిల్ ఫిక్స్ చేశాం. దర్శకుడు శశికాంత్ చాలా క్లారిటీతో తీశారు. నిర్మాత కె.వి. శ్రీధర్ రెడ్డి ఖర్చుకు వెనుకాడలేదు.''
కారు డిజైనులో కాంప్రమైజ్ కాలేదు
''ఈ సినిమా కంప్లీట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏమీ కాదు. ఓ కుర్రాడు తనకు సంబంధం లేని సమస్యల్లో పడితే ఏం అవుతుంది? దాని నుంచి ఎలా బయట పడతాడు? అనేది చూపించాం. ఐడియా బావుంటుంది. 'రొమాంటిక్' సినిమాతో ఫైట్ మాస్టర్ పృథ్వీకి మంచి బ్రేక్ వచ్చింది. సహజంగా ఫైట్స్ కంపోజ్ చేస్తారు. ఫైటులో కూడా కథ చెప్పాలనుకుంటారు. 'టాప్ గేర్' కోసం ఆయన చాలా కష్టపడ్డాడు. ఉదయం నాలుగు గంటలకు ఓ సీన్ చేశాం. అప్పుడు యాక్సిడెంట్ కూడా జరిగింది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు అన్నీ నైట్ టైమ్ షూటింగ్ చేశాం. సినిమా అంతా ఎక్కువ భాగం కారులో ఉంటుంది. అందుకని, కారు డిజైన్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. మా ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ బాగా డిజైన్ చేశారు.''
Also Read : సాయి పల్లవికి శ్రీలీల రీప్లేస్‌మెంట్ అవుతోందా? - 'ఫిదా' బ్యూటీ కండిషన్స్ 'ధమాకా' భామకు ప్లస్సా?
ఆయన 'అర్జున్ రెడ్డి' చేశారు
''టాప్ గేర్'లో సంగీతానికి చాలా ప్రాముఖ్యం ఉంది. హర్షవర్ధన్ రామేశ్వర్ చాలా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఆయన అంతకు ముందు 'అర్జున్ రెడ్డి' చేశారు. ఇప్పుడు రవితేజ 'రావణాసుర', హిందీలో సందీప్ రెడ్డి వంగా చేస్తున్న 'యానిమల్' చేస్తున్నారు. మా సినిమా చూసి చాలా బావుందని మెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఒకే ఒక్క పాట ఉంటుంది. దానికి మంచి ట్యూన్ ఇచ్చారు.''
ఎవరూ ఊహించని పాత్రలో...
''కొత్త కథలు, ప్రయోగాలు చేయాలని నాకూ ఉంటుంది. ప్రస్తుతం జీ5 కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. అందులో ఎవరూ ఊహించనటువంటి పాత్ర పోషిస్తున్నా. నా దగ్గరకు వచ్చే కథలన్నీ కమర్షియల్ హంగులతో ఉంటున్నాయి. అయితే, నాకు రియలిస్టిక్ సినిమాలు చేయాలని ఉంటుంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ కాకుండా లక్కీ మీడియా సంస్థలో ఓ సినిమా చేస్తున్నాను. వెబ్ సిరీస్ షూటింగ్ అయిపోయింది. అందులో 8 ఎపిసోడ్స్ ఉంటాయి.''
నా సినిమాలు ఓటీటీలో బాగా ఆడుతున్నాయి
''మంచి కంటెంట్ ఉంటేనే నిర్మాతలు నా దగ్గరకు వస్తారు. 'శశి'కి ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. ఓటీటీలో 'క్రేజీ ఫెలో'కి మంచి పేరొచ్చింది. కొన్ని పరిస్థితుల వల్ల నా సినిమాలు థియేటర్లలో సరిగా ఆడలేదు. నా సినిమాలు అన్నీ సాంకేతికంగా బావుంటాయి.''
Also Read : పవన్ కళ్యాణ్ వెంట త్రివిక్రమ్ - 'అన్‌స్టాపబుల్ 2' ఎపిసోడ్‌లోనూ ఆయనే