‘‘నాయాల్ది, కత్తందుకో జానకి..’ ఈ డైలాగ్ వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది రెబల్ స్టార్ కృష్ణం రాజే. ఈ డైలాగు ఇప్పటికీ పాపులర్‌గా చక్కర్లు కొడుతుందంటే..  కృష్ణం రాజుకు ఉన్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడంటే ఆ డైలాగును కామెడీగా వాడేస్తున్నారు గానీ.. ఆ సినిమాలో మాత్రం అది సీరియస్ డైలాగ్. అయితే, ‘రెబల్’ (తిరుగుబాటుదారుడు) అని పేరు తెచ్చుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ, కృష్ణం రాజు‌కు ఆ టైటిల్ రావడానికి కారణం ఆయన చేసిన సినిమాలే. చెప్పాలంటే, అది ఆయనకు ప్రజలు ఇచ్చిన బిరుదు. ఎందుకంటే, సాంఘిక చిత్రాలు చేయాలంటే.. ఎంతో సాహసం చేయాలి. స్టార్‌డమ్‌ను పక్కన పెట్టాలి. కృష్ణం రాజు అది చేసి చూపించారు. అప్పటి సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించే చిత్రాలను చేశారు.


‘కొండవీటి నాగులు’ ‘బొబ్బిలి బ్రహ్మన్న’, ‘కటకటాల రుద్రయ్య’, ‘మనవూరి పాండవులు’, ‘మనుషులు మారాలి’, ‘నీతి నియమాలు’, ‘తాండ్ర పాపారాయుడు’  ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాల్లో ఆయన గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. ఆయా సినిమాల్లోని పాత్రలే ఆయనకు రెబల్ స్టార్‌గా పేరు తెచ్చాయి. అయితే, కృష్ణం రాజు కేవలం ఆ సినిమాలకే పరిమితం కాలేదు. ‘భక్తకన్నప్ప’ నుంచి ‘బావ బావమరిది’ వరకు ఎన్నో భిన్నమైన పాత్రలతో మెప్పించారు. ఆయన నటించిన చివరి చిత్రం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ అనే చెప్పుకోవాలి. ఆ సినిమా తెలుగు వెర్షన్‌లో మాత్రమే ఆయన పాత్రను చూపించారు. 


కృష్ణం రాజు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో 1940, జనవరి 20న జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. వీరు విజయనగర సామ్రాజ్య రాజకుటుంబానికి చెందిన వంశస్తులు. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి. 1996లో నవంబరు 21న వీరి వివాహం జరిగింది. ఆయనకు ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా పని చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. 1966లో ‘చిలకా గోరింక’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1970, 1980లలో దాదాపు 183 కు పైగా సినిమాలలో నటించారు.


‘అవే కళ్లు’ చిత్రంలో కృష్ణం రాజు ప్రతినాయకుడిగా కూడా నటించారు. 1977, 1984 సంవత్సరాల్లో నంది అవార్డులు కూడా ఆయన్ను వరించాయి. 1986 లో ‘తాండ్ర పాపారాయుడు’ సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. 2006లో ఫిల్మ్ ఫేర్ సౌత్ జీవన సాఫల్య పురస్కారం అందింది. బొబ్బిలి బ్రహ్మన్న, భక్త కన్నప్ప, సినిమాలు ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. కృష్ణంరాజు రాజకీయాల్లో కూడా కొన్నాళ్లు యాక్టీవ్‌గా ఉన్నారు. 1991లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాదిలో నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ 1998లో 13వ లోక్ సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. 1999 మధ్యంతర ఎన్నికలు రావడంతో అప్పుడు కూడా నర్సాపురం లోక్‌సభ నుండి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొందారు. అలా కేంద్రంలోని అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రభుతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ అదే స్థానం నుండి బీజేపీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి జోగయ్య చేతిలో ఓటమి చెందారు. మార్చి 2009లో బీజేపీని వీడి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.


Also Read : కృష్ణం రాజు రేర్ ఫోటోస్ - అప్పట్లో ఎలా ఉండేవారో చూడండి



Also Read : రాజకీయాల్లోనూ రెబల్ స్టార్, ఓడిన చోటే నెగ్గి కేంద్ర మంత్రి అయిన కృష్ణంరాజు