Vijay Antony Hitler Teaser: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గా ‘బిచ్చగాడు 2‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, చక్కటి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ‘హిట్లర్‘ అనే పాన్ ఇండియన్ మూవీలో నటిస్తున్నారు. ధన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సరసన రియా సుమన్‌ హీరోయిన్ గా కనిపించబోతోంది.  ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.


మాస్ యాక్షన్ తో ఆకట్టుకుంటున్న టీజర్


‘హిట్లర్‘ టీజర్ ను పూర్తి స్థాయి యాక్షన్ ఎలిమెంట్స్ తో అద్భుతంగా రూపొందించారు. “మనం యద్దానికి వాడబోయే ఆయుధాన్ని నిర్ణయించేది మన శత్రువే" అని డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. ఈ చిత్రంలో విజయ్ ఓవైపు గ్యాంగ్ స్టర్ గా, మరోవైపు రొమాంటిక్ బాయ్ గా దర్శనం కనిపించాడు. టీజర్ చూస్తుంటే రాజకీయం నేపథ్యంలో ఈ సినిమా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో  అచ్చం ‘బిచ్చగాడు’ లుక్ లోనే విజయ్ కనిపించాడు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో విజయ్ ఓ పొలిటికల్ మెసేజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు,  టీజర్ లో ఒక కిల్లర్, ఒక డిక్టేటర్, ఒక ఛేజ్, ఒక టార్గెట్ అంటూ పూర్తి కథను చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. పొలిటికల్ థ్రిల్లర్ గా రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్  ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.



ఈ మూవీతో విజయ్ మరో హిట్ కొట్టేనా?


‘హిట్లర్’ చిత్రంలో చరణ్ రాజ్, రెడ్డిన్ కింగ్స్లి, వివేక్ ప్రసన్న, తమిజ్, ఆడుకాలం నరేన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే విజయ్ ఆంటోనీతో కలిసి ఈ సంస్థ ‘విజయ్ రాఘవన్’ అనే సినిమా చేసింది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వివేక్, మెర్విన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ‘బిచ్చగాడు 2’తో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోనీ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.  


కూతురు మరణం బాధలో విజయ్ కుటుంబం  


ఇక ఈ ఏడాది విజయ్ ఇంట్లో పెద్ద విషాద ఘటన జరిగింది. ఆయన కూతురు మీరా ఆత్మహత్య చేసుకుంది. డిప్రెషన్ తట్టుకోలేక ఆమె చనిపోయింది. ఆ బాధ నుంచి విజయ్ కుటుంబం బయటకు రాలేకపోతుంది. విజయ్ భార్య తన కూతురును పదే పదే తలుచుకుంటుంది. సోషల్ మీడియా వేదికగా తన బాధను అభిమానులతో పంచుకుంటుంది. విజయ్ ఆ బాధ నుంచి పూర్తిగా బయటకు రాకపోయినా, వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే సినిమాలు చేస్తున్నారు. విమర్శలను పట్టించుకోకుండా.. ముందుగా తాను కమిట్ అయిన మూవీస్‌ను కంప్లీట్ చేసి వెంట వెంటనే రిలీజ్ చేసే పనిలో ఉన్నారు.


Read Also: హాలీవుడ్‌కు షాకిచ్చిన ‘సలార్’, ‘డంకీ’ - గ్లోబల్ బాక్సాఫీస్‌ బాక్స్ బద్దలు