హీరో డా. రాజశేఖర్ తండ్రి వరదరాజన్‌ గోపాల్‌ (93) గురువారం సాయంత్రం హైద‌రాబాద్‌ సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ రోజు (శుక్రవారం) ఉదయం 6.30 గంటలకు వరదరాజన్‌ గోపాల్‌ భౌతికకాయాన్ని రాజశేఖర్ కుటుంబ సభ్యులు ఫ్లైట్‌లో చెన్నైకు తీసుకువెళ్లారు.


రాజశేఖర్ తండ్రి స్వస్థలం తమిళనాడు. ఆయన పోలీస్ శాఖలో పలు పదవులు నిర్వర్తించారు. చెన్పై డీసీపీగా పదవీవిరమణ చేశారు. వరదరాజన్‌ గోపాల్‌కు మొత్తం ఐదుగురు పిల్లలు. ఐదుగురిలో రాజశేఖర్ రెండో సంతానం. ఆయనకు ఇద్దరు సోదరులు, సోదరీమణులు ఉన్నారు. రాజశేఖర్ తండ్రి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల క్రితం రాజశేఖర్ తల్లి మరణించిన సంగతి తెలిసిందే.


మావయ్యగారి మరణం తమ కుటుంబానికి తీరని లోటు అని, ఈ బాధ మాటల్లో వర్ణించలేనిదని జీవితా రాజశేఖర్ సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్టు తెలిసింది. వ‌ర‌ద‌రాజ‌న్ గోపాల్‌కు నివాళులు అర్పించాలనుకునే వారి కోసం... ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత నుంచి ప్రజల సందర్శనార్థం వరదరాజన్ భౌతిక కాయాన్ని చెన్నైలో స్వగృహంలో ఉంచనున్నారు. శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలిసింది.


సినిమాలకు వస్తే... రాజశేఖర్ హీరోగా నటించిన 'శేఖర్'ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. లలిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ముస్కాన్ హీరోయిన్. ఈ సినిమా కోసం రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ మైంటైన్ చేస్తున్నారు. 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వంలో మరో సినిమా 'పరమాణువు' కూడా చేస్తున్నారు. ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని చూస్తున్నారు. తండ్రి మరణంతో కొన్ని రోజులు సినిమా పనులకు విరామం ఇవ్వవచ్చు. రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక 'దొరసాని'తో కథానాయికగా పరిచయమయ్యారు. పెద్ద కుమార్తె ఈ ఏడాది 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ', 'అద్భుతం' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వీళ్లిద్దరూ తమిళ సినిమాలు కూడా చేస్తున్నారు. 


Also Read: 'మంచి రోజులు వచ్చాయి' సమీక్ష: మంచి నవ్వులు వచ్చాయి! కానీ...


Also Read: 'పెద్దన్న' సమీక్ష: ఇదేంటన్నయ్యా... ఇలాగైతే కష్టమే!


Also Read: ఎనిమీ రివ్యూ: ఈ ఎనిమీ.. యాక్షన్ లవర్స్‌ను మెప్పిస్తాడు


Also Read: రవితేజ వర్సెస్ బెల్లంకొండ... రియల్ టైగర్ ఎవరు? ఎవరి టైగర్ ముందు?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి