Guntur Kaaram VS Hanuman: సంక్రాంతి పండుగ వేళ టాలీవుడ్ లో గట్టి పోటీ నెలకొంది. ఈసారి పండుగ బరిలో నాలుగు సినిమాలు నిలిచాయి. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం‘, తేజ సజ్జ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘హనుమాన్‘, నాగార్జున ‘నా సామిరంగ‘, వెంకటేష్ ‘సైంధవ్‘ సినిమా ప్రేక్షకులకు వినోదపు విందును పంచుతున్నాయి. మిగతా సినిమాల విషయం పక్కన పెడితే ఇవాళ(జనవరి 12న) విడుదలైన 'గుంటూరు కారం', 'హనుమాన్' చిత్రాల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ కొనసాగుతోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ తో యంగ్ హీరో తేజ సజ్జ ఢీకొట్టారు.
బుకింగ్స్ లోనూ దూసుకెళ్తున్న ‘హనుమాన్‘
విడుదలకు ముందే ‘గుంటూరు కారం‘తో పోల్చితే, ‘హనుమాన్‘ మూవీ టికెట్ బుకింగ్స్ లో టాప్ లో కొనసాగింది. అంతేకాదు, ‘హనుమాన్‘ సినిమా చూసేందుకే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపించారు. ఆన్ లైన్ టికెటింగ్ యాప్ బుక్ మై షో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక టికెట్ల సేల్ విషయంలోనూ మహేష్ మూవీతో పోల్చితే తేజ సజ్జ మూవీ దూసుకెళ్తోంది. గంట వ్యవధిలో ‘గుంటూరు కారం‘ సినిమా 16 వేల టికెట్లు బుక్ కాగా, ‘హనుమాన్‘ మూవీ సుమారు 20 వేల టికెట్లు బుక్ అయ్యాయి. ప్రస్తుతం మహేష్ మూవీ బుకింగ్స్ లో వెనుకబడింది.
మహేష్ బాబు సొంత మల్టీఫ్లెక్స్ లో ‘గుంటూరు కారం‘ షో క్యాన్సిల్?
‘హనుమాన్‘ దూకుడుతో ‘గుంటూరు కారం‘ సినిమాకు షాకుల మీద షాకులు ఎదురవుతున్నాయి. ఏకంగా మహేష్ సొంత మల్టీఫ్లెక్స్ AMB సినిమాస్(గచ్చిబౌలి)లో తొలిరోజే ‘గుంటూరు కారం‘ సినిమా క్యాన్సిల్ అయ్యింది. కొత్తగా యాడ్ చేసిన 1 PM స్లాట్ కు బుకింగ్స్ లేకపోవడంతో షో క్యాన్సిల్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుకు తన సొంత మల్టీప్లెక్స్ లో ఎదురుదెబ్బ తగిలిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై మల్టిఫ్లెక్స్ నిర్వాహకులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వాస్తవానికి ‘గుంటూరు కారం’ మూవీకి సంబంధించిన టికెట్లు బుధవారమే నిండిపోయాయి. అయితే, క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం 1 గంటకు కూడా స్లాట్స్ యాడ్ చేశారని తెలుస్తోంది.
ఇక 'హనుమాన్' మూవీలో తేజ సజ్జాకు జంటగా అమృత అయ్యర్ నటించింది. కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్, సీనియర్ నటుడు, దర్శకుడు సముద్రఖని ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. అటు ‘గుంటూరు కారం’ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించింది. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. హాసిని, హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించారు. తమన్ సంగీతం అందించారు.
Read Also: ‘కల్కి’ నుంచి క్రేజీ అప్ డేట్, టీజర్ రిలీజ్ అప్పుడేనా?