Kalki 2898 AD Teaser Release: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కుతోంది. గత మూడు సంవత్సరాలుగా ఈ మూవీ షూటింగ్ కొనసాగుతోంది. దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ప్రభాస్ కెరీర్ లో తొలిసారి సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ సినిమాటిక్ వ్యాల్యూస్ తో ఈ మూవీ రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. 

  


టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?


మేకర్స్ అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ సినిమా టీజర్ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ నెటిజన్ CBFC సర్టిఫికేట్‌ను పోస్ట్ చేశారు. జనవరి 11న ఈ సినిమా టీజర్ ను సెన్సార్ బోర్డు పరిశీలించినట్లు వెల్లడించారు. 1.23 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ యు/ఎ సర్టిఫికేట్ పొందినట్లు తెలుస్తోంది.


వేసవి కానుకగా మే 9న విడుదల


గతంలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను సంక్రాంతి(2024) కానుకగా విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే, సినిమా షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. మే 9న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. సమ్మర్ హాలీడేస్ సినిమా వసూళ్లకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  






వైజయంతి మూవీస్ సెంటిమెంట్ కలిసి వచ్చేనా?    


వాస్తవానికి వైజయంతీ మూవీస్ బ్యానర్‌ మీద తెరకెక్కిన చాలా సినిమాలకు ఈ సినిమా డేట్ బాగా సెంటిమెంట్. గతంలో చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కని ‘జగదేక వీరుడు- అతిలోక సుందరి’ మూవీ 1990 మే 9న  విడుదల అయ్యింది. అప్పట్లో ఈ మూవీ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఇదే బ్యానర్ లో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’ కూడా 2018 మే 9న విడుదల అయ్యింది. ఈ సినిమా కూడా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నటనకు గాను కీర్తి సురేష్ కు ఏకంగా ఉత్తమ జాతీయ నటి అవార్డు కూడా దక్కింది. ఇదే తేదీన ‘కల్కి 2898 ఏడీ’ని కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తమ సెంటిమెంట్ ఈ సినిమాకు కూడా బాగా కలిసి వస్తుందని భావిస్తున్నారు. 


‘కల్కి 2898 ఏడీ’ సినిమా కథ ఏంటనే విషయంలో ఇప్పటికే మేకర్స్ చాలా క్లూస్ ఇచ్చారు. ఇది టైం ట్రావెలర్ మూవీ అని వెల్లడించారు. భవిష్యత్ తో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఇందులో చూపించబోతున్నట్లు తెలిపారు. మోడ్రన్ కాలానికి పురాణాల పవర్ యాడ్ అయితే, ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త గెటప్ లో అలరించనున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ ఇందులో నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్ మరో కీ రోల్ ప్లే చేస్తున్నారు. దిశా పటాని సైతం  ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తోంది. సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


Read Also: ‘గుంటూరు కారం’లో ఘాటు మిస్సైందా? గురూజీ మడతపెట్టేశారట - ప్రేక్షకుల రివ్యూ ఇది