రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ 'కల్కి 2989 ఏడీ'. క్లాసిక్ హిట్ 'మహానటి' తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సినిమా విడుదల తేదీని ఇవాళ అధికారికంగా వెల్లడించారు.


మే 9న ప్రభాస్ 'కల్కి' విడుదల
మే 9, 2024లో 'కల్కి' సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ తెలిపింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటు విదేశీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. విడుదల తేదీతో పాటు ప్రభాస్ కొత్త స్టిల్ కూడా విడుదల చేశారు. 


'కల్కి'ని మే 9న ఎందుకు విడుదల చేస్తున్నారు? ఆ రోజు స్పెషాలిటీ ఏమిటి? అంటే... చిరంజీవి, శ్రీదేవి జంటగా వైజయంతి మూవీస్ ప్రొడ్యూస్ చేసిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఆ రోజే విడుదల అయ్యింది.


Also Read: గుంటూరు కారం రివ్యూ : మహేష్ ఎనర్జీ, ఆ మాస్ సూపర్, మరి సినిమా?






మే 9న నాగ్ అశ్విన్ 'మహానటి' కూడా! 
మే 9కి, 'కల్కి' సినిమాకు మరొక అనుబంధం ఏమిటంటే... దర్శకుడు నాగ్ అశ్విన్. ఆయన దర్శకత్వం వహించిన సావిత్రి బయోపిక్ 'మహానటి' విడుదలైనది కూడా ఆ రోజే. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ ఆ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. దర్శక, నిర్మాతలకు బాగా కలిసి వచ్చిన రోజు కావడంతో మే 9న 'కల్కి'ని విడుదల చేస్తున్నారు. మెగా సెంటిమెంట్ అండ్ డైరెక్టర్ సెంటిమెంట్ కూడా!


Also Readహనుమాన్ రివ్యూ: తేజ సజ్జ & ప్రశాంత్ వర్మ సినిమా గుంటూరు కారం కంటే బావుందా? అసలు ఎలా ఉంది?


'కల్కి 2989 ఏడీ' చిత్రాన్ని రూ. 400 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... ప్రభాస్ 'సలార్' డిసెంబర్ 23న థియేటర్లలోకి వచ్చింది. ఆ సినిమా విడుదల తేదీ వెల్లడించిన సమయంలో సంక్రాంతికి విడుదల కాదని ప్రేక్షకులకు సైతం అర్థమైంది. వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 


'కల్కి' సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రభాస్, దీపిక నటిస్తున్న తొలి చిత్రమిది. తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన 'లోఫర్'... హిందీలో 'ఎంఎస్ ధోని', 'బాఘీ 2', 'భారత్', 'ఏక్ విలన్ రిటర్న్స్' సినిమాలు చేసిన దిశా పటానీ కీలక పాత్ర చేస్తున్నారు. ఆమెది సెకండ్ హీరోయిన్ రోల్ అని టాక్. భారతీయ చిత్ర పరిశ్రమలో లెజెండరీ హీరోలు బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ సైతం 'కల్కి 2989 ఏడీ' సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నారని సమాచారం.