Hansika Motwani New House : సౌత్ లో స్టార్ హన్సిక తాజాగా కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. తాజాగా ఆ ఇంట్లోకి తన భర్తతో కలిసి అడుగు పెడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. హన్సిక కొత్త ఇంటి గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హన్సిక గృహ ప్రవేశం
దక్షిణాది చిత్రాలతో సహా కొన్ని హిందీ చిత్రాలలో నటించి తనకంటూ ఇండస్ట్రిలో నటిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది హన్సిక. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ 'కోయి మిల్ గయా'లో బాలనటిగా నటించి టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్‌గా ఎదిగింది. టాలీవుడ్ లో 'దేశముదురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హన్సిక. ఇందులో అల్లు అర్జున్ తో ఆమె ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు మూవీ లవర్స్ ఫిదా అయ్యారు. అయితే ఆ తరువాత 'దేశముదురు' రేంజ్ హిట్ దక్కలేదు. అడపా దడపా అవకాశాలు వచ్చినా అవి యావరేజ్ లేదా డిజాస్టర్ టాక్ ను తెచ్చుకున్నాయి.
కోలీవుడ్ లో మాత్రం తన హవాను బాగానే చూపించింది. పెళ్లి తరువాత లేడి ఓరియంటెడ్ సినిమాలకు పరిమితం అయిన హన్సిక తాజాగా కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేయడం విశేషం. ఇక నటిగా ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న హన్సిక మోత్వాని కొత్తగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. హన్సిక 2022 డిసెంబర్ 4న సోహైల్ కతురియాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్ళయిన రెండేళ్ల తరువాత ఈ జంట కొత్త ఇల్లు కొన్నారు. హన్సిక తన కొత్త గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలను అభిమనులతో పంచుకుంది.
హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో భర్త సోహైల్ కతురియాతో తమ ఆచారాల పద్ధతుల్లో పూజ చేస్తున్న చిత్రాలను పంచుకుంది. ఈ ప్రత్యేక సందర్భంలో హన్సిక ఆకుపచ్చ పట్టు చీరను ధరించింది. ఈ లుక్‌లో ఆమె చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆమె భర్త సోహైల్ కతురియా లేత ఆకుపచ్చ రంగు షేర్వాణీ ధరించాడు. కొన్ని రోజుల క్రితమే హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో BMW 6 సిరీస్ లగ్జరీ కారును కొన్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తానికి కొత్త కారు, కొత్త ఇల్లు కొన్న హన్సికకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
హన్సిక చివరి సినిమా ఇదే
ఇదిలా ఉంటే బాలనటిగా టీవీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆమె 2000లో 'షక లక బూమ్ బూమ్'లో కనిపించింది. ఆ తర్వాత ఆమె ఏక్తా కపూర్ ప్రముఖ సీరియల్ 'సాస్ భీ కభీ బహు థీ'లో కనిపించింది. ఇక హీరోయిన్ గా మారాక భారీ సంఖ్యలో తెలుగు, తమిళ సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. హన్సిక చివరిసారిగా 2024లో వచ్చిన హారర్ చిత్రం 'గార్డియన్'లో కనిపించింది. ఇప్పుడు ఆమె తదుపరి తమిళ చిత్రం 'రోదయా బేబీ'లో కనిపించనుంది. ఈ సినిమా నవంబర్ 2024లో విడుదల కానుంది. ఈ చిత్రానికి జెమ్ రాజా శర్వణన్ దర్శకత్వం వహిస్తున్నారు.