Ayushman Card Offline Process: భారత ప్రభుత్వం, దేశంలోని ప్రజల సంక్షేమం కోసం చాలా పథకాలను అమలు చేస్తోంది. వాటిలో ఆరోగ్యానికి సంబంధించిన పథకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు, వైద్యం చాలా ఖరీదైన వ్యవహారంలా మారింది. మన దేశంలో, కాస్ట్‌లీ మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ను భరించలేని పేద ప్రజలే మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. ఈ వర్గాల ప్రజల కోసం, భారత ప్రభుత్వం 2018లో 'ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన'ను ప్రారంభించింది.


ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన (Pradhan Mantri Ayushman Bharat Yojana) కింద, భారత ప్రభుత్వం అర్హులైన లబ్ధిదార్లకు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్స సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ పథకం ప్రయోజనాలను పొందాలంటే లబ్ధిదారు పేరిట ఆయుష్మాన్ కార్డ్‌ ఉండాలి. ఈ కార్డును భారత ప్రభుత్వం జారీ చేస్తుంది. ఆయుష్మాన్ కార్డును ఆఫ్‌లైన్‌లో ఎలా పొందాలి, ఏయే పత్రాలు అవసరమో తెలుసుకుందాం.


ఆయుష్మాన్ కార్డ్‌ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ‍(How to Apply for Ayushman Card?)‌     
ఆయుష్మాన్ కార్డ్‌ను జారీ చేయడానికి భారత ప్రభుత్వం కొన్ని అర్హత ప్రమాణాలను నిర్ణయించింది. అర్హులైన వ్యక్తులు ఆయుష్మాన్ కార్డ్‌ను ఆఫ్‌లైన్‌లో పొందాలనుకుంటే, సమీపంలోని కామన్‌ సర్వీస్‌ సెంటర్‌కు (CSC) వెళ్లాలి. అక్కడ ఉన్న వ్యక్తికి వివరాలు చెబితే, అతను మీ అర్హత వివరాలను తెలుసుకుంటాడు. దీనికోసం కొన్ని రుజువు పత్రాలను అడుగుతాడు. CSCలో అడిగిన పత్రాలను మీరు సమర్పిస్తే, అతను మీ పత్రాలను ధృవీకరిస్తాడు. ఆ తర్వాత మీ పేరుతో ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తాడు. ప్రభుత్వ అధికార్లు కూడా మీ పత్రాలను ధృవీకరించుకున్న తర్వాత మీ పేరిట ఆయుష్మాన్ కార్డ్ జారీ అవుతుంది. ఆ కార్డ్‌ను మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


ఆయుష్మాన్ కార్డ్‌ తీసుకోవడానికి ఎవరు అర్హులు? ‍‌(Who is Eligible for Ayushman Card?)        
భారత ప్రభుత్వం పేద ప్రజల కోసం ఆయుష్మాన్ కార్డులను జారీ చేస్తుంది. ఇందుకోసం కొన్ని అర్హత ప్రమాణాలను ఖరారు చేసింది. అసంఘటిత రంగాల్లో పని చేసే వ్యక్తులు ఆయుష్మాన్ కార్డు పొందడానికి అర్హులు. వీళ్లతో పాటు.. నిరుపేదలు లేదా గిరిజనులు కూడా ఈ కార్డ్‌ను అందుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, షెడ్యూల్డ్ కులం (SC) లేదా షెడ్యూల్డ్  తెగకు (ST) చెందిన వారు, కుటుంబంలో దివ్యాంగులు ఉన్నవాళ్లు, రోజువారీ కూలీగా పని చేసే వాళ్లు ఆయుష్మాన్‌ కార్డును పొందడానికి అర్హులు. 


మీ అర్హతను ఈ విధంగా తనిఖీ చేయొచ్చు (How to check your eligibility for Ayushman Card?)
మీ ఆయుష్మాన్ యోజన ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, దానికి మీరు అర్హులో, కాదో మీరే చెక్ చేసుకోవచ్చు. దీని కోసం, ఆయుష్మాన్‌ యోజన అధికారిక వెబ్‌సైట్ https://beneficiary.nha.gov.in/ లోకి వెళ్లి మీ అర్హతను తనిఖీ చేయవచ్చు.


మరో ఆసక్తికర కథనం: ఈ ఒక్క ఫారం నింపండి చాలు - టీడీఎస్‌ కటింగ్‌ తగ్గుతుంది, మీ జీతం పెరుగుతుంది