పూజా హెగ్డే ప్రస్తుతం సినిమాల నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం. తాజాగా మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’, పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. చివరి క్షణాల్లో ఆమె తప్పుకోవల్సి వచ్చింది. అయితే, ఆమెను కావాలనే ఆ సినిమాల నుంచి తొలగించారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, అసలు విషయం వేరే ఉందట. ఆమెను ఆయా సినిమాల నుంచి తొలగించలేదని, ఆమే స్వయంగా తప్పుకుందని సమాచారం. అదేంటీ, అన్ని మంచి అవకాశాలు వస్తే వదులుకోవడం ఏమిటని అనుకుంటున్నారా? ఇందుకు కారణం ఆమె ఆరోగ్య పరిస్థితే. 


గతేడాది నవంబరు నెలలో పూజా హెగ్డే కాలికి శస్త్ర చికిత్స జరిగింది. అయితే, ఆమె ఆ నొప్పి నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఇంకా కాలు నొప్పిగా ఉండటంతో మరో సర్జరీకి ఆమె సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆమె ఈ విషయాన్ని ఎక్కడా బయట తెలియకుండా జాగ్రత్తపడింది. షూటింగ్‌కు డేట్స్ ఇచ్చేస్తే ఇబ్బందులు వస్తాయని భావించి ఆమె ఆ సినిమాల నుంచి తప్పుకున్నట్లు సమాచారం. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆమె తిరిగి సినిమాలకు సైన్ చేయాలని భావిస్తుందట. అందుకే, పూజా మహేష్, పవన్ కళ్యాణ్ సినిమాలను వదులుకుందట. మరి ఇది ఎంతవరకు నిజమనేది ఇంకా తెలియాల్సి ఉంది. 


సరైన హిట్లు లేక సతమతం


పూజా హెగ్డేకు ఈ ఏడాది చెప్పుకోతగిన హిట్లు లేవు. 2022లో రిలీజైన రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’, మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, విజయ్ ‘బీస్ట్’, బాలీవుడ్‌లో ‘సర్కస్’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. ఈ ఏడాది ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమా కూడా ఫ్లాప్ లిస్టులో చేరింది. దీంతో పూజాకు టైమ్ బాగాలేదంటూ ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు కూడా చేజారడంతో పూజాను మరింత నిరుత్సాహానికి గురిచేశాయని టాక్. ఈ అవకాశం శ్రీలీలాకు బాగా కలిసి వచ్చింది. అయితే, పూజా హెగ్డేకు అవకాశాలు రాకపోవడం అనేది జరగదు. ఆమె మళ్లీ ఫామ్‌లోకి వచ్చిందంటే.. దర్శకులు మళ్లీ క్యూ కడతారని ఆమె అభిమానులు అంటున్నారు. పూజాకు ఉన్న డిమాండ్ అలాంటిదని అంటున్నారు. 


తమిళ్, కన్నడ సినిమాల్లో అవకాశాలు?


ప్రస్తుతమైతే పూజా ఏ సినిమాలోనూ నటించడం లేదు. అలాగని ఆమె చేతిలో సినిమాలు లేవనుకుంటే పొరపాటే. ఇప్పటికే ఆమె రెండు హిందీ సినిమాలతో పాటు ఒక తమిళ సినిమా, మరో కన్నడ సినిమాలో నటించేందుకు డేట్స్ ఇచ్చిందట. ఇంకా ఆ సినిమాలు ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం పూజా ఒకే చెప్పిన బాలీవుడ్ సినిమా ‘హౌస్ ఫుల్ 5’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. పూజా కూడా షూటింగ్‌లో పాల్గోనుందని తెలిసింది. ఈ నేపథ్యంలో పూజా హెగ్డే ఇప్పట్లో తెలుగు సినిమాల్లో కనిపించే అవకాశాలైతే లేవనే అనుకోవాలి. 


Read Also: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్, ‘నా సామిరంగ’ అనేలా నాగ్ కొత్త మూవీ అనౌన్స్!