ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు - ఆరెంజ్ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చెప్పే మాట. ఇద్దరు ప్రేమికులు లేదా అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్లు‌... ఎవరి మధ్య అయినా ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి కుటుంబంలోనూ మనస్పర్ధలు, ఏవో చిన్న చిన్న గొడవలు ఉండటం సహజం. ఒకరి మీద మరొకరు మాటా మాట అనుకోవడం కూడా అంతే కామన్. అయితే... పిల్లలకు ఇంటి పెద్ద సర్ది చెబుతారు. ఇంట్లోని రచ్చ వీధికి లేకుండా జాగ్రత్త పడతారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఓ ఇంటిలో కనిపించడం లేదు. ఏకంగా ఇంటి పెద్ద మీద కొడుకు ఎదిరించే వరకు వచ్చింది అంటే... కారణం ఏమై ఉంటుంది? అని సామాన్యుల్లో చర్చ మొదలైంది. 


అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు??
తెలుగు ప్రజల్లో ఆ కుటుంబానికి ఒక పేరు ఉంది. ఇండస్ట్రీలోని పెద్దల నుంచి చిన్నల వరకు ఆ ఇంటి సభ్యులు అంటే గౌరవం ఉంది. క్రమశిక్షణకు మారుపేరుగా ఆ ఇంటి పెద్ద గురించి అందరూ చెబుతారు. అయితే... ఇప్పుడు ఆ ఇంటిలో వివాదాలు రావడం ఒక విధంగా అందరినీ ఆశ్చర్యపరిచే అంశమే. అందుకు కారణం అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు అని గుసగుసలు వినబడుతున్నాయి.


సినిమా పరిశ్రమలో ఎటువంటి అండ లేకుండా స్వయంకృషితో, తన నటన - తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులలో పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆ ఇంటి పెద్ద. సామాన్య స్థాయి నుంచి వచ్చిన ఆయన వందల కోట్ల రూపాయలు సంపాదించారు. నటుడిగా చిత్రశ్రమలో కష్టపడి తాను సంపాదించిన రూపాయలలో మెజారిటీ మొత్తాన్ని భూమి మీద పెట్టారు. హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ముందు నగర శివారులలో ఆస్తులు కొన్నారు. తనను ఇంతటి వాడిని చేసిన ప్రజల కోసం ఏదైనా చేయాలి ఒక విద్యాసంస్థను నెలకొల్పారు. అందులో కులమతాలకు అతీతంగా 20 శాతం విద్యార్థులకు ఫ్రీగా చదువు చెప్పిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆస్తి రెండు వేల కోట్లకు పైగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచునా వేస్తున్నాయి.


ఆస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ కొన్ని రోజుల క్రితం మొదలు అయ్యింది అని ఇండస్ట్రీలోని కొంత మంది గుసగుస. ఆ విషయంలో ఇద్దరికీ సర్ది చెప్పడానికి పెద్దాయన చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ సయోధ్య కుదరడం లేదట. సమాన వాటాలు వేయడం లేదని అన్నదమ్ములు గొడవ పడుతున్నారా? లేదంటే ఆస్తిలో ఎవరు ఎక్కడ ఎంత వాటా తీసుకోవాలని కింద మీద అవుతున్నారా? అనేది బయటకు రాలేదు. కానీ అన్నదమ్ముల మధ్య సయోధ్య లేదు అనేది సుస్పష్టం. ఆ మధ్య తమ్ముడు రెండో పెళ్లి చేసుకున్నప్పుడు సైతం అన్నయ్య అంతగా స్పందించిన దాఖలాలు గానీ, దగ్గర ఉండి పెళ్లి పనులు చూసుకున్నట్లు గాని తెలియలేదు. 


Also Read: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?


తన మనుషులపై అన్న దాడి చేస్తున్నాడని సోషల్ మీడియాలో తమ్ముడు ఒక వీడియో పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేశాడు. ఇక ఇప్పుడు ఏకంగా తనయుడి మీదకు తండ్రి దాడికి వెళ్లాడనే రీతిలో కథనాలు వచ్చాయి. సదరు వార్తల్లో నిజం లేదని, అసత్య ప్రచారం ఆపాలని మీడియాకు విజ్ఞప్తులు వచ్చాయి. ఆధారాలు లేకుండా ఎటువంటి కథనాలు ప్రసారం చేయవద్దని కోరారు. అయితే... ఇప్పుడు తనయుడు కుంటుతూ ఆస్పత్రికి వచ్చారు. పరోక్షంగా తనపై దాడి జరిగిందని చెప్పారు. కేసు పెట్టే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు విశ్లేషకులు.


కేసులకు కోర్టులకు ఆధారాలు కావాలి... అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ, నిప్పు లేకుండా పొగ వస్తుందా అనేది ఇక్కడ సామాన్యులలో మొదలు అవుతున్న ప్రశ్న. ఇప్పుడు తండ్రి కొడుకులు మధ్య కొట్లాట అంటే... అప్పట్లో అన్నదమ్ముల మధ్య కొట్లాట కూడా నిజమే అయి ఉంటుందనేది జనాల్లో బలపడుతున్న నమ్మకం. తమ కుటుంబంలో ఎటువంటి కలహాలు లేవు అని చెప్పడం కంటే... తనయులు ఇద్దరితో కలిసి మీడియా ముందుకు తండ్రి వస్తే బాగుంటుందనే సలహా అభిమానుల నుంచి వ్యక్తం అవుతుంది. తాము అభిమానించే కుటుంబంలోని హీరోల మధ్య గొడవ అనే వార్తలు పెద్దాయన అభిమానులను కాస్త కలవర పెడుతున్నాయని చెప్పాలి. నిప్పు లేకుండా పొగరాదని, ఆ కుటుంబంలో ఏదో జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాలు సైతం నమ్ముతున్నాయి‌. ఇప్పుడు గొడవ లేదని చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు.


Also Read: బంజారా హిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్