Pushpa 2 Release Date Postponed: టాలీవుడ్‌కు 2024 అనేది చాలా కీలకంగా మారింది. తెలుగు నుండే ఎన్నో ప్యాన్ ఇండియా సినిమాలు ఇదే ఏడాదిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో మూవీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఒక కామన్ ప్రాబ్లమ్ మాత్రం ఇంకా ఫ్యాన్స్‌ను వెంటాడుతూనే ఉంది. అదే రిలీజ్ డేట్ వాయిదా పడడం. త్వరలో విడుదల కానున్న ప్యాన్ ఇండియా సినిమాలన్నీ దాదాపుగా రెండుసార్లు విడుదల తేదీని వాయిదా వేసుకున్నాయి. తాజాగా టాలీవుడ్‌లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ‘పుష్ప 2’ మరోసారి పోస్ట్‌పోన్ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్‌లో మరోసారి డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే, తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితాల వల్ల కాదని, దానికి వేరే కారణాలు ఉన్నాయని టాలీవుడ్ సమాచారం.


పలుమార్లు పోస్ట్‌పోన్..


సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ గురించి దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప ది రైజ్’ విడుదలయ్యి దాదాపు రెండున్నర ఏళ్లు అవుతోంది. అయినా కూడా ‘పుష్ప ది రూల్’ మాత్రం ఇంకా విడుదల అవ్వలేదు. గతేడాది డిసెంబర్‌లోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సమ్మర్‌లో అయినా విడుదల అవుతుంది అనుకుంటే ఏకంగా ఇది ఆగస్ట్‌కే పోస్ట్‌పోన్ అయ్యింది. దీంతో ఆగస్ట్ 15 కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఆఖరికి అప్పుడు కూడా విడుదల అవ్వదు అని వస్తున్న వార్తలు అందరినీ షాక్‌కు గురయ్యేలా చేస్తున్నాయి. అల్లు అర్జున్.. వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేశాడనే కారణంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మూవీని బాయ్‌కట్ చేస్తామని ప్రకటిస్తున్నారు. కాబట్టి, ఇప్పట్లో ఈ మూవీని రిలీజ్ చేయకపోవడమే మంచిదనే ఆలోచన కూడా ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే, ఇవన్నీ సందేహాలు మాత్రమే. అసలు విషయం ఏమిటనేది మూవీ టీమ్ ప్రకటించాకే తెలుస్తుంది.


మేకర్స్ అలర్ట్..


‘పుష్ప 2’కు ఎడిటర్‌గా కార్తిక శ్రీనివాస్ రంగంలోకి దిగాడు. కానీ పలు కారణాల వల్ల ఆయన ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు. ఆ స్థానంలోకి నవీన్ నూలి వచ్చి ఫైనల్ కట్స్ చేశారు. కానీ సుకుమార్‌కు ఫైనల్ ఔట్‌పుట్ నచ్చకపోవడంతో పోస్ట్ ప్రొడక్షన్‌కు ఇంకా సమయం పడుతుందని, దానివల్లే ఆగస్ట్ 15న ‘పుష్ప 2’ విడుదల కాదని సమాచారం. కానీ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి ఇంకా ఎవరూ ముందుకు రాలేదు. ‘పుష్ప 2’ వాయిదా అని వార్తలు రాగానే ఇతర మేకర్స్ అంతా అలర్ట్ అయ్యారు. తమ సినిమాలను ఆగస్ట్ 15కే విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అందులో ‘దేవర’ కూడా ఒకటి.


రేసులోకి రెండు సినిమాలు..


ప్యాన్ ఇండియా సినిమా అంటే రిలీజ్ డేట్ పక్కాగా ఉండాలి. అలాంటి రిలీజ్ డేట్ దొరకకపోవడం వల్లే ఎన్‌టీఆర్ నటిస్తున్న ‘దేవర’.. ఏకంగా అక్టోబర్‌కు పోస్ట్‌పోన్ అయ్యింది. ఇప్పుడు ‘పుష్ప 2’ తప్పుకుంటుందనే వార్తలు రావడంతో ఆగస్ట్ 15కే ‘దేవర’ రిలీజ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట. దాంతో పాటు రోహిత్ శెట్టి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘సింగం ఎగైన్’ కూడా ఇదే రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకోనుంది. ఇవి మాత్రమే కాకుండా పలు ఇతర భాషా చిత్రాలు కూడా ఆగస్ట్ 15పైనే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆగస్ట్ 15 నుంచి ‘పుష్ప 2’ తప్పుకుంటే.. సెప్టెంబర్ 27న విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. అనుకున్న తేదీకి విడుదల కాకపోతే ఈ మూవీకి రూ.30 కోట్ల ఓపెనింగ్స్‌ను మిస్ అవుతుందని ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నారు.


Also Read: అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసిన ఆ మెగా హీరో - ఫ్యామిలీలో విభేదాలు మొదలయ్యాయా?