యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన చిత్రం 'ఆరడుగుల బులెట్'. ఈ సినిమా ఎప్పుడో ఏడెనిమిదేళ్ల క్రితం పూజాకార్యక్రమాలు జరుపుకొని సెట్స్ పైకి వెళ్లింది. కానీ ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. రకరకాల కారణాల వలన సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. మధ్యలో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారని టాక్ వచ్చింది. కానీ చిత్రబృందం మాత్రం అక్టోబర్ 8న సినిమాను థియేటర్లో విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. దానికి తగ్గట్లే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. 

 


 

ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఎలాంటి బాధ్యతా లేకుండా ఆవారాగా తిరిగే హీరో.. అతడిని ఎప్పుడూ తిడుతూ ఉండే తండ్రి.. మధ్యలో హీరోయిన్ తో హీరో ప్రేమ.. ఇలా తిరిగే హీరో.. తన తండ్రికి ఒక సమస్య రాగానే ఎదిరించి నిలబడతాడు. బెజవాడను గడగడలాడించే విలన్ తో గొడవ పెట్టుకుంటాడు హీరో. దీంతో విలన్ గ్యాంగ్ హీరోని టార్గెట్ చేసి.. తమ సత్తా చూపించే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో హీరో వారిని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే కథ. 

 

ట్రైలర్ ను బట్టి చూస్తుంటే గోపీచంద్ నుంచి ఆశించే మాస్, యాక్షన్ అంశాలకు లోటు లేని సినిమా అనిపిస్తుంది. ట్రైలర్ మొత్తం మాస్ ఎలిమెంట్స్ తో నింపేశారు. అయితే ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ట్రైలర్ లో అయితే ఎలాంటి కొత్తదనం కనిపించలేదు. ఎప్పటిదో సినిమా కావడంతో అందరి లుక్స్ కూడా పాతగా అనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. వక్కంతం వంశీ కథతో బి.గోపాల్ ఈ సినిమాను రూపొందించారు. మణిశర్మ సంగీతం అందించారు.