వారిద్దరి ప్రేమ ఈనాటిది కాదు... 35 ఏళ్ల క్రితానిది. ఆ ప్రేమకు పెళ్లితో శుభంకార్డు వేయాలనుకున్నారు. కానీ పెళ్లి కూతురి తల్లిదండ్రులు, అమ్మమ్మ పెళ్లికి రాలేని పరిస్థితి. దీంతో పెళ్లి వేదికే మారిపోయింది. రెండు దేశాల బోర్డర్లో ఘనంగా జరిగింది పెళ్లి. కరెన్ మహోనీ... ఈమె నివసించేది న్యూయార్క్ లో. కుటుంబం మాత్రం కెనడాలో ఉంటోంది. ఇక పెళ్లి కొడుకు బ్రియాన్ రే. ఇతని కుటుంబం అమెరికాలోనే ఉంటోంది. వీరిద్దరూ చాలా చిన్నప్పట్నించే స్నేహితులు. కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరగా పెళ్లి కూడా చేసుకోవాలనుకుని ఓ చర్చిలో పెళ్లికి అంతా సిద్ధం చేశారు. అక్కడే వచ్చింది చిక్కు. ఆ పెళ్లికి కెనడా నుంచి అమెరికాకు రావడం వధువు కరేన్ కుటుంబానికి కుదరలేదు. కోవిడ్ మరణాలు పెరుగుతుండడంతో అమెరికా, కెనడాలు ప్రయాణాలను కట్టడి చేశాయి.
కరేన్ కు 96 ఏళ్ల తన అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. ఆమె సమక్షంలోనే తన పెళ్లి జరగాలని కోరిక. తల్లిదండ్రులు, అమ్మమ్మ ఉండగా ఎవరు లేని దానిలా పెళ్లి చేసుకోవడం ఆమెకు ఇష్టం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక తన స్నేహితుడికి సమస్య చెప్పుకుంది. అతను అమెరికా-కెనడా బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ లో పనిచేస్తున్నాడు. ఆ రెండు దేశాల బోర్డర్లో చాలా చోట్ల కేవలం పునాది రాళ్లతోనే సరిహద్దును నిర్ణయించి వదిలేశారు. ఎలాంటి కంచెలు ఏర్పాటు చేయలేదు. దీంతో తన పెళ్లిని కెనడా-అమెరికా బోర్డర్ మార్చేసింది కరేన్. అక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా, బోర్డర్ సెక్యూరిటీని ఒప్పించే పనని తన స్నేహితుడికి అప్పగించింది. అంతా అనుకున్నట్టు సజావుగా సాగింది. అమెరికా భూభాగంలో కరేన్-బ్రియన్ పెళ్లి జరుగ్గా... కేవలం ఆరడుగుల దూరం నుంచే కరేన్ అమ్మమ్మ, తల్లిదండ్రులు ఆ పెళ్లిని చూశారు. పెళ్లయ్యాక తన అమ్మమ్మని ప్రేమగా హత్తుకుంది కరేన్. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంది. ప్రియురాలు కోరుకున్నట్టే ఎలాంటి బోర్డర్లో పిచ్చి చెట్లు, రాళ్ల గుట్టల మధ్యే పెళ్లికి ఒప్పుకున్న బ్రియాన్ కూడా మంచి మనసున్న వాడే. వీరి పెళ్లి ఇప్పుడు అమెరికా, కెనడాలో ట్రెండింగ్ గా మారింది.
Also read: పిల్లల్ని ఆడనివ్వండి... పెద్దయ్యాక డిప్రెషన్ బారిన పడరు
Also read: కరోనా వల్ల కొత్త సమస్య... సంతానోత్పత్తిపై కూడా ప్రభావం
Also read: ఇలాంటి చేప కనిపిస్తే ముచ్చటేసి పట్టుకోకండి... ప్రాణాలు పోతాయ్