చిత్రా శుక్లా, ఆదర్శ్, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'గీత సాక్షిగా' (Geeta Sakshiga Movie). ఈ సినిమాలోని రెండో పాట 'అబ్బా అబ్బా ఓ అబ్బాయా' పాటను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) విడుదల చేశారు.
రెహమాన్ రాత...
సాహితీ స్వరం!
'గీత సాక్షిగా' సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన బాణీ అందించిన 'అబ్బా అబ్బా ఓ అబ్బాయా...'ను రెహమాన్ రాయగా... సాహితీ చాగంటి హస్కీ వాయిస్‌లో పాడారు. సాధారణంగా అమ్మాయిలను వర్ణిస్తూ అబ్బాయిలు ఎక్కువగా పాటలు పాడుతుంటారు. అబ్బాయిలపై అమ్మాయిలు తమ ఇష్టాన్ని వ్యక్తం చేసే పాటలు తక్కువగా వస్తుంటాయి. అటువంటి పాటల్లో ఇదొకటి.
'అబ్బా అబ్బా ఓ అబ్బాయా...' పాట విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ ''సాంగ్ చాలా క్యాచీగా ఉంది. పిక్చరైజేషన్, కొరియోగ్రఫీ చాలా చాలా బాగున్నాయి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రేక్షకులు అందరికీ నచ్చేలా పాట ఉంటుందని కచ్చితంగా చెప్పగలను'' అన్నారు. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్, ఇతర చిత్ర బృందం ఆయనకు థాంక్స్ చెప్పారు.
చేతన్ రాజ్ కథ అందించడంతో పాటు చేతన్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై చిత్రాన్ని నిర్మించారు. ఆంథోని మట్టిపల్లి స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించారు.
వాస్తవ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. కంటెంట్ బేస్డ్ చిత్రమిదని వారు పేర్కొన్నారు. ఒక చిన్నారి చుట్టూ ఈ కథ తిరుగుతుందట. చిన్నారిని ఎవరో పట్టుకోవాలని ప్రయత్నించడం, ఆ పెద్దల నుంచి తప్పించుకోవడానికి చిన్నారి వేసే అడుగులు ఆసక్తిగా ఉంటాయట.
Also Read : 'వండర్ ఉమెన్' రివ్యూ : అమ్మ కాబోయే మహిళలు, భర్తలు తప్పకుండా చూడాల్సిన సినిమా!
'గీత సాక్షిగా'లో ఎవరి క్యారెక్టర్లు ఏంటి?
'గీత సాక్షిగా' సినిమాలో ఆదర్శ్ జైలులో ఖైదీగా కనిపించనున్నారు. అతని తరపున వాదించే న్యాయవాది పాత్రలో చిత్రా శుక్లా, ఆమెకు ప్రత్యర్థి న్యాయవాదిగా శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషించారు.
టీజర్‌లో ఏముంది?
'గీత సాక్షిగా' టీజర్ విషయానికి వస్తే... ఆదర్శ్‌ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకు వెళ్లడం, అతని కోసం చిత్రా శుక్లా జైలుకు వెళితే... ముఖం మీద ఒకరు ఇంక్ పోయడం వంటివి టీజర్‌లో చూడవచ్చు. జైలులో కొంత మంది ఎటాక్ చేయబోతే... అందరినీ చితక్కొట్టిన ఆదర్శ్... 'పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుడిని కాదు, వాడి బాబు అర్జునుడిని రా' అంటూ చెప్పిన డైలాగ్, ఆయన సిక్స్ ప్యాక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాపై ఆసక్తి పెంచాయి.
Also Read : 'ఐరావతం' రివ్యూ : థ్రిల్స్ ఉన్నాయా? లేదంటే టార్చర్ చేశారా?
భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు గోపీసుందర్ (Gopi Sundar Music Director) స్వరాలు, నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ హనుమ, ఎడిటర్: కిశోర్ మద్దాలి, సాహిత్యం: రెహమాన్, కళ: నాని, నృత్యం : యశ్వంత్ - అనీష్, ఫైట్స్ : పృథ్వీ.