అందం, అభినయంతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న అతిలోక సుందరి దివంగత శ్రీదేవి. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు.  80వ దశకంలో హీరోయిన్ గా కనీ వినీ ఎరుగని రీతిలో క్రేజ్ సంపాదించుకుంది. పెళ్లి తర్వాత 1997లో నటనా జీవితానికి కాస్త విరామం ప్రకటించారు. మళ్లీ 2012లో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ‘ఇంగ్లీష్- వింగ్లీష్’ సినిమాతో మళ్లీ వెండితెరపై రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం విడుదలై అక్టోబర్ 10తో పదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంగ్లిష్‌-వింగ్లిష్‌’ మూవీలో శ్రీదేవి కట్టుకున్న చీరలను వేలం వేసేందుకు సినిమా యూనిట్ రెడీ అవుతోంది. 


ఈ నెల 10న వేలం కోసం ప్రత్యేక ఈవెంట్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు ‘ఇంగ్లిష్‌-వింగ్లిష్‌’ డైరెక్టర్ గౌరీ షిండే వెల్లడించారు. ఈ సినిమా 10వ వార్షికోత్సవం నిర్వహించడంతో పాటు, ఇందులో  శ్రీదేవి ధరించిన చీరల వేలం పాట నిర్వహించనున్నారు. వేలం ద్వారా వచ్చిన డబ్బును బాలికల అభ్యున్నతి కోసం వినియోగించనున్నట్లు వెల్లడించారు.


గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం పని చేసే ఎన్జీవోకు ఈ మొత్తాన్ని అందిస్తామని చెప్పారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సాధారణ ఇల్లాలిగా, ఇంగ్లీష్ రాని మహిళగా అద్భుత నటనను కనబర్చారు. అమెరికాలో ఇంగ్లీష్ రాక తను ఎన్నో ఇబ్బందులు పడతారు. ఆ తర్వాత ఇంగ్లీష్ లో అద్భుతంగా రాణించి మెప్పిస్తారు. గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఈ సినిమాలో నటించి మెప్పించారు శ్రీదేవి.


అద్భుత నటనతో దేశ వ్యాప్తంగా ఆశేష అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి..  2018 ఫిబ్రవరి 24న దుబాయ్ లో కన్నుమూశారు. తాను బసచేసిన హోటల్ గది బాత్‌ టబ్‌ లో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయింది. బాల నటిగా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన శ్రీదేవి.. నెమ్మది నెమ్మదిగా హీరోయిన్ గా ఎదిగారు. అప్పటి యంగ్ హీరోలతో నటిస్తూనే సీనియర్ నటులతోనూ జోడీ కట్టారు. ‘బడి పంతులు’ సినిమాతో ఎన్టీఆర్ మనువరాలిగా నటించిన శ్రీదేవి.. కొంతకాలం తర్వాత అతడి పక్కనే హీరోయిన్ గా యాక్ట్ చేశారు. అక్కినేని నాగేశ్వర్ రావుతోనూ పలు హిట్ సినిమాలు చేశారు. ఆ తర్వాత నాగార్జునతోనూ జతకట్టారు. నటనకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు శ్రీదేవి. తన సినీ కెరీర్ లో 250 సినిమాలకు పైగా నటించి మెప్పించారు. 


Also Read : 'గాడ్ ఫాదర్' రివ్యూ : మెగాస్టార్ మూవీ హిట్టా? చిరంజీవి రాజకీయ నేపథ్య చిత్రమ్ ఎలా ఉందంటే?


Also Read : ది ఘోస్ట్ రివ్యూ: సంక్రాంతి హిట్‌ను నాగార్జున దసరాకు రిపీట్ చేశారా?