BRS Odelu :   చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ తీర్థం స్వీకరించారు. నల్లాల ఓదెలు, మంచిర్యాల జడ్పీ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి దంపతులకు కేటీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, చెన్నూరు, ఆర్మూర్‌ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, ఆశన్నగారి జీవన్‌రెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు.అంతకుముందు ఓదెలు సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు.
నిన్నటి వరకు ఆయన కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగారు. 


బాల్క సుమన్‌తో సరి పడక కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఓదేలు


నల్లాల ఓదెలు తన రాజకీయ జీవితాన్ని టీఆర్‌ఎస్‌తోనే ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో 2010లో రాజీనామా చేసి.. మరోసారి గెలుపొందారు. 2014లోనూ టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఆయనకు టిక్కెట్ నిరాకరించారు. అక్కడి నుంచి  పెద్దపల్లి ఎంపీగా  ఉన్న బాల్క  సుమన్‌కు టిక్కెట్ ఇచ్చారు. అప్పట్లోనే ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా పార్టీ నేతలు బుజ్జగించారు. 


కాంగ్రెస్‌లో  గ్రూపుల గోలతో మరోసారి టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం


ఆ తర్వాత నల్లాల ఓదెలు భార్య భాగ్యలక్ష్మికి మంచిర్యాల జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే పార్టీలో తనకు ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదని అవమానిస్తున్నారన్న కారణంగా ఆయన పార్టీకి దూరమయ్యారు. మే 19వ తేదీన మాజీ ఎమ్మెల్యే దంపతులు ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఓదెలు దంపతులకు కాంగ్రెస్‌లోనూ ఇమడలేకపోయారు. మంచిర్యాల జిల్లా నేతలతో సరిపడ లేదు. దీంతో మళ్లీ టీఆర్ఎస్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.  నాలుగున్నర నెలలకే  మళ్లీ సొంత గూటికి చేరారు.   తిరిగి గులాబీ గూటికి చేరడం చాలా ఆనందంగా ఉందని మాజీ ఎమ్మెల్యే ఒదేలు, జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. 


మూడు వారాల కిందటే్ ఓదెలు కుటుంబాన్ని మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి ఖాళీ చేయించిన ప్రభుత్వం 


మూడు వారాల కిందట  మినిస్టర్ క్వార్టర్స్‌లో  నల్లాల ఓదెలు  ఇంటిని అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు.  గతంలో ఓదెలు ప్రభుత్వ విప్ ఉండగా క్వార్టర్స్‌లో ప్రభుత్వం  ఇంటిని కేటాయించింది.  ఆ ఇంటిలోనే ఓదెలు  ఉంటున్నారు. టీఆర్ఎస్  పార్టీలో ఉన్నంత వరకు క్వార్టర్స్‌లోనే ఉండేందుకు ప్రభుత్వ పెద్దలు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత వారిని ఇల్లు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఖాళీ చేయకపోయేసరికి బలవంతంగా ఖాళీ చేయించారు.  ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ పోరాడింది. రేవంత్ రెడ్డి కూడా స్పందంచారు. అయితే మూడు వారాల్లోనే మళ్లీ ఓదెలు టీఆర్ఎస్‌లో చేరిపోయారు.


కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటనపై ఎమ్మెల్యే ఈటల ఘాటు వ్యాఖ్యలు, పగటి కలలంటూ సెటైర్!