ఫేస్‌బుక్‌లో పరిచయం ఓ బాలిక పాలిట శాపం అయింది. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు పెంచుకొని యువతీ యువకులు ఎన్ని విధాలుగా నష్టపోతున్నారు. ఇది మరోసారి తెలియజేసే సంఘటన తనకల్లు మండలం ఎర్రబెల్లి గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.  


తనకల్లు మండలం ఎర్రబల్లికి చెందిన శ్రీనివాసులు, రాధమ్మ ఏకైక కుమార్తె సంధ్యారాణి మొలకలచెరువులో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఫేస్‌బుక్‌లో నల్లచెరువు మండలం తెలుగు యువత కార్యదర్శిగా పనిచేస్తున్న రాళ్లపల్లి ఇంతియాజ్ పరిచయమయ్యాడు. ఈ స్నేహం పేరుతో బాలిక ఫోటోలు తీసిన ఇంతియాజ్ మాయమాటలు చెప్పాడు.  తల్లిదండ్రులకు గొర్రెలు ఇప్పిస్తానని, బాలికను ముంబాయికి తీసుకెళ్తానని చెప్పాడు. 


వాటిని నమ్మిన ఆ ఫ్యామిలీ అతను చెప్పినట్టే చేసింది. అదే వారిని విషాదంలోకి నెట్టేసింది. బాలిక ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని బెదిరించాడు ఇంతియాజ్‌. తనకు లొంగిపోవాలని లేకుంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడు. తన వద్ద అన్ని వీడియోలు ఉన్నాయని ఫొటోలు ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో కంగారు పడిపోయిన ఆ బాలిక ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంది. 


బుధవారం తెల్లవారుజామున గొర్రెలకు కాపలాగా తల్లిదండ్రులు వెళ్ళిన టైంలో బాలిక సూసైడ్ చేసుకుంది. తన చావుకు ఇంతియాజ్‌ కారణమని సెల్ఫీ వీడియోలో చెప్పి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చి చూసిన తల్లిదండ్రులు జరిగిన ఘోరంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఎన్నో ఆశలు పెట్టుకొని ఓ వ్యక్తిని నమ్మితే ఇంతలా మోసం చేయడమే కాకుండా తమ బిడ్డ చావుకు కారణమయ్యాడని బోరుమన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.