చెన్నైకి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య.. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తెలుగులో ఆయన అల్లు అర్జున్ సినిమాలకు పని చేశారు. రీసెంట్ గా 'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా మావ' సాంగ్ కి కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇదిలా ఉండగా.. గణేష్ ఆచార్యపై 2020లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది.
గణేష్ ఆచార్య తనను లైంగిక వేధిస్తున్నాడంటూ అతడి కోడాన్సర్ కేసు పెట్టింది. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి గణేష్ ఆచార్యపై చార్జ్‌షీట్ ఫైల్ చేశారు ముంబై పోలీసులు. అతడితో పాటు ఆయన అసిస్టెంట్ పై 354-ఎ, 354-సి, 354-డి,509,323, 504 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. గణేష్ ఆచార్య తనతో తప్పుగా ప్రవర్తించడంతో పాటు పోర్న్ వీడియోలు చూపించాడని ఆరోపించింది మహిళా కొరియోగ్రాఫర్.
గణేష్ మాస్టర్ తనను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాడని.. మే, 2010లో తనతో శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడని తెలిపింది. తాను చెప్పినట్లుగా చేస్తే ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి లొంగదీసుకోవాలని చూశాడని వెల్లడించింది. అయినప్పటికీ తాను నిరాకరించడంతో ఆరు నెలల్లోనే ఇండియా ఫిలిం అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ లో సభ్యత్వం రద్దు చేయించినట్లు చెప్పుకొచ్చింది.
అలానే మాస్టర్ తన అసిస్టెంట్స్ తో దాడి చేయించాడని.. ఆ మహిళా అసిస్టెంట్లు తనను దారుణంగా కొట్టి.. బూతులు తిట్టారని చెప్పుకొని వాపోయింది. ఇవన్నీ జరిగిన తరువాత గణేష్ ఆచార్యపై నాన్ కాగ్నిసబుల్ కేసు నమోదు చేశానని తెలిపింది. అయితే ఈ కేసు విషయంపై గణేష్ ఆచార్య ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు!