Talli Bidda Express Inaguration: అక్క చెల్లెమ్మల‌కు త‌మ ప్రభుత్వం ఎప్పుడూ అండ‌గా ఉంటుందని సీఎం జ‌గ‌న్ అన్నారు. వారికి కావాల్సిన అన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని చెప్పారు. గ‌ర్బం దాల్చిన వెంట‌నే ప్రభుత్వ వాహ‌నాల్లో ఆసుప‌త్రికి తీసుకువెళ్లి వారికి వైద్య స‌దుపాయాలు కూడా క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. త‌ల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహ‌నాల్లో ఇంటి వ‌ర‌కు డ్రాపింగ్ చేసే స‌దుపాయాలు క‌ల్పిస్తున్నామ‌ని వివ‌రించారు. నాడు - నేడు ప‌థకం ద్వారా ఆసుప‌త్రుల రూపురేఖ‌ల‌ను మార్చేస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్ వెల్లడించారు. విజయవాడలోని బెంజిస‌ర్కిల్ వ‌ద్ద త‌ల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహ‌నాల‌ను జగన్ జెండా ఊపి ప్రారంభించారు. దాదాపుగా 500 వాహ‌నాల‌ను ఒకే సారి జ‌గ‌న్ ప్రారంభోత్సవం చేశారు. 


ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ గ‌తంలో అర‌కొర సదుపాయాలు త‌ల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహ‌నాల్లో ఉండేవ‌ని జ‌గ‌న్ అన్నారు. త‌మ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఎయిర్ కండిష‌న్ స‌దుపాయంతో త‌ల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహ‌నాలను ఆధునీక‌రించి అందుబాటులోకి తీసుకువ‌చ్చామ‌ని జ‌గ‌న్ చెప్పారు. గ‌ర్బం దాల్చిన అక్కచెల్లెమ్మల‌ను వాహ‌నాల్లో తీసుకువెళ్లి, తిరిగి వారిని ఇంటి వ‌ద్ద దింపేందుకు ఈ వాహ‌నాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని తెలిపారు. గ‌ర్బంతో ఉన్న మ‌హిళ‌ల‌కు ప్రపంచ ఆరోగ్య సంస్ద సూచ‌న‌ల‌కు అనుగుణంగా మందులు అందచేస్తున్నామ‌ని వివ‌రించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, శంకర నారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.







ఇలా పని చేస్తాయి
ఆస్పత్రుల్లోని నర్సులు, వాహనాల డ్రైవర్ల మధ్య కో ఆర్డినేషన్ కోసం ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆస్పత్రుల్లో జరిగే ప్రతి ప్రసవానికి సంబంధించిన వివరాలు మాతృ, శిశు సంరక్షణ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఆ వివరాలను యాప్‌కు అనుసంధానించి బాలింతలను క్షేమంగా ఇంటికి తరలించేందుకు చర్యలు తీసుకుంటారు. బాలింతను వాహనంలో ఎక్కించుకున్నప్పుడు, ఆమెను ఇంటి దగ్గర దించాక ఈ యాప్‌లో డ్రైవర్‌ ఫొటో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. తల్లీబిడ్డల రక్షణ, భద్రతకు భరోసానిస్తూ అన్ని వాహనాలకూ జీపీఎస్‌ ట్రాకింగ్‌ సౌకర్యం ఉంటుంది. అలాగే ప్రసవానంతరం తల్లికి ప్రభుత్వం వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద వివిధ అవసరాల కోసం రూ.5 వేలు చెల్లిస్తుంది. 


రాష్ట్ర వ్యాప్తంగా 1,057 ప్రభుత్వాస్పత్రుల్లో ఏడాదికి సగటున నాలుగు లక్షల దాకా ప్రసవాలు జరుగుతుంటాయి. నెలలు నిండిన గర్భిణులను కాన్పుకు ఇంటి నుంచి 108 వాహనంలో తీసుకెళ్లి ఆస్పత్రిలో చేరుస్తున్నారు. నాణ్యమైన వైద్య సేవలు, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.