'గాడ్ ఫాదర్' (Godfather) థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇచ్చే హై నుంచి అంత త్వరగా బయటకు రాలేరని టాక్. ఈ సినిమా హైలైట్స్‌లో క్లైమాక్స్ ఒకటి అవుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. క్లైమాక్స్‌లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి చేసే ఫైట్ ఇరువురి అభిమానులతో పాటు ప్రేక్షకులకు ట్రీట్ కింద ఉంటుందట!
Chiranjeevi Godfather Climax Fight : 'గాడ్ ఫాదర్'లో క్లైమాక్స్ ఫైట్ / సీన్ సుమారు 15 నిమిషాలు ఉంటుందని తెలిసింది. అందులో చిరంజీవి, సల్మాన్... ఇద్దరూ కనిపిస్తారు. మలయాళ హిట్ సినిమా 'లూసిఫర్'కి ఇది రీమేక్ అన్నది తెలిసిందే. అయితే, ఆ సినిమాతో పోలిస్తే... 'గాడ్ ఫాదర్'లో కొన్ని మార్పులు చేసినట్టు సమాచారం. అందులో క్లైమాక్స్ ఫైట్ ఒకటి. 'లూసిఫర్'లో ఉన్నది ఉన్నట్లు తీయకుండా... కొత్తగా ట్రై చేశారట. కథలో ఆత్మ మిస్ కాకుండా ఆడియన్స్‌కు 'హై' ఇచ్చేలా డిజైన్ చేశారట. క్లైమాక్స్‌ను చిరు, సల్మాన్ ఇమేజ్‌కు తగ్గట్టు తీశారట.
కథలోనూ కొన్ని మార్పులు
క్లైమాక్స్ ఫైట్ ఒక్కటే కాదు... 'లూసిఫర్' కథలోనూ కొన్ని మార్పులు చేసి 'గాడ్ ఫాదర్' తెరకెక్కించారని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని కొన్ని కమర్షియల్ అంశాలు యాడ్ చేశారట. అదీ అసలు కథకు ఏమాత్రం అడ్డు పడకుండా చేశారట.
ప్రస్తుతం 'గాడ్ ఫాదర్' ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రేపు (సెప్టెంబర్ 28న) అనంతపురంలో మెగాభిమానుల సమక్షంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి ఏర్పాట్లు రెడీ అయ్యాయి. చిరంజీవిని శ్రీముఖి చేసిన ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. అన్నిటి కంటే ముఖ్యంగా 'నేను రాజకీయానికి దూరం అయ్యాను. కానీ, రాజకీయాలు నాకు దూరం కాలేదు' అంటూ ఆ మధ్య ట్విట్టర్ వేదికగా చిరంజీవి విడుదల చేసిన డైలాగ్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.
Also Read : పూరీ జగన్నాథ్ చస్తే చేయనన్నాడు, గజగజా వణికిపోయాడు - చిరంజీవి
'గాడ్ ఫాదర్'కు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చిరు సోదరిగా నయనతార (Nayanthara) కనిపించనున్నారు. ఆమెకు భర్త, ప్రతినాయకుడి పాత్రలో సత్యదేవ్, ఇతర కీలక పాత్రల్లో సునీల్, సముద్రఖని నటించారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ (Thaman) సంగీత దర్శకుడు, నీరవ్ షా ఛాయాగ్రాహకుడు, సురేష్ సెల్వరాజన్ కళా దర్శకుడు.
'లూసిఫర్ 2' షురూ!
'లూసిఫర్' తెలుగు రీమేక్ ఈ నెలలో విడుదల అవుతోంది. విశేషం ఏమిటంటే... మలయాళంలో 'లూసిఫర్' సీక్వెల్ షురూ అయ్యింది. ఆగస్టులో మోహన్ లాల్, నిర్మాత ఆంటోనీ పెరంబవూర్, నటుడు మురళీతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ఫర్మ్ చేశారు. మరి, ఆ సినిమాను తెలుగులో విడుదల చేస్తారా? లేదంటే చిరంజీవి రీమేక్ చేస్తారా? అనేది చూడాలి.
Also Read : 'ది ఘోస్ట్' ట్రైలర్ ఎఫెక్ట్ - నాగార్జున నిర్మాతల ప్లానింగ్‌లో భారీ మార్పులు