తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించాయి. ఇప్పటి వరకు దర్శకుడిగా  సత్తా చాటిన పూరి.. త్వరలో నటుడిగా ఫ్రూవ్ చేసుకోబోతున్నారు. అదీ మెగాస్టార్ సినిమా ద్వారా. మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న తాజా మూవీ ‘గాడ్ ఫాదర్’లో  పూర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. మలయాళ హిట్ మూవీ ‘లూసిఫర్’కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.


చిరంజీవి సతీమణి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులో  సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, సత్య దేవ్‌,  స‌ల్మాన్ ఖాన్ కీల‌క పాత్ర‌లు చేస్తున్నారు. ఇందులో దర్శకుడు పూరి జగన్నాథ్ మరో కీ రోల్ పోషిస్తున్నారు. ‘గాడ్ ఫాద‌ర్‌’లో ఆయ‌న జర్నలిస్ట్ పాత్రను చేస్తున్నాడట. ఈ పాత్రకు ఎవరిని సెలెక్ట్ చేయాలా? అని దర్శకుడు ఆలోచిస్తుండగా.. పూరి అయితే బాగుంటుందని స్వయంగా చిరంజీవి సూచించారట.  పూరి జగన్నాథ్ యాటిట్యూడ్ కు ఈ క్యారెక్టర్ కచ్చితంగా సూటవుతుందని చెప్పారట.  


ఇక జైల్లో ఖైదీగా ఉన్న చిరంజీవి దగ్గరికి  పూరి వెళ్లి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అప్పుడే చిరంజీవి తన ఫ్లాష్ బ్యాక్ చెప్పనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పూరి ఇన్వెస్టిగేట్ జర్నలిస్టుగా కనిపిస్తారట. రాజకీయ వ్యవస్థలోని కొందరు అవినీతిపరుల బండారం బయటపెట్టడంలో పూరి కీలకంగా వ్యవహరిస్తారట.  ఇప్పటి వరకు చిరంజీవితో సినిమా చేయకపోయినా, ఆయనతో సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు పూరి.  


అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు ‘గాడ్ ఫాదర్’ సినిమా రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి.  ఇందులో భాగంగా యాంకర్ శ్రీముఖి చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది. ఇందులో పూరి జగన్నాథ్ గురించి కీలక విషయాలు చెప్పారు. జర్నలిస్ట్ పాత్రలో పూరీ జగన్నాథ్ ను చేయాలని కోరిన సమయంలో “నేను చస్తే చేయను సార్” అని  అన్నాడని చిరంజీవి చెప్పుకొచ్చారు. పూరీ జగన్నాథ్ లో కమాండింగ్ ఉన్న నటుడు ఉన్నాడని సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే ఆశ్చర్యపోతారని చిరంజీవి వెల్లడించారు. షూటింగ్ కు ముందు తను కెమెరా ముందుకు వచ్చేందుకు చాలా భయపడ్డారని చెప్పారు. ఒకరకంగా పూరి వణికిపోయినట్లు వెల్లడించారు. చివరకు అద్భుతంగా నటించారని చిరు ప్రశంసించారు.


ఈ సినిమాలో హీరోయిన్ లేదని, పాటలు లేవనే ఆలోచన ప్రేక్షకులకు రాదని చెప్పారు. అంత అద్భుతంగా ముందుకు సాగుతుందన్నారు. సల్మాన్ ఖాన్ ఎంతో ప్రేమతో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటించారని చెప్పారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ కు చిరంజీవి హ్యాట్సాఫ్ చెప్పారు. ఈ సినిమాకు థమన్ సంగీతం ఆరో ప్రాణమన్నారు. ‘గాడ్ ఫాదర్’ మూవీ నిశ్శబ్ద విస్పోటనంగా చిరంజీవి అభివర్ణించారు.


Also Read : 'ఆదిపురుష్' ట్రెండ్ సెట్టర్ - నేను ప్రభాస్ వీరాభిమాని : సోనాల్ చౌహన్ ఇంటర్వ్యూ


Also Read : ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌నన్న ముందు కాదు - బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్