Venkatesh Maha deletes Twitter account: సినిమా పరిశ్రమలో విభేదాలు అనేవి కామన్ గా ఉంటాయి. ఒక దర్శకుడు తెరకెక్కించిన సినిమాలపై మరొక దర్శకుడు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు ఈ విమర్శలు వివాదాలకు కారణం అవుతాయి. ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు కారణం అవుతాయి. తాజాగా దర్శకుడు వెంకటేష్ మహా అలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు వెంకటేష్. లైఫ్ యాంథాలజీ గా వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత సత్యదేవ్ హీరోగా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ వంటి డిఫరెంట్ జోనర్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. గత కొంత కాలంగా ఆయన చేస్తున్న కామెంట్స్ తీవ్ర విమర్శలు కారణం అవుతున్నాయి. తాజాగా నెటిజన్ల విమర్శలకు భయపడి ఏకంగా తన ట్విట్టర్ అకౌంట్ నే డీ యాక్టివేట్ చేసుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.


వెంకటేష్ మహా ట్వీట్ పై ప్రభాస్ అభిమానుల ఆగ్రహం


కొద్ది రోజుల క్రితం ప్రశాంత్ నీల్, యష్ కాంబోలో వచ్చిని ‘KGF’ చిత్రంపై వెంకటేష్ మహా చేసిన విమర్శలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై ఆయన వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా ఆయన ‘డుంకీ’ సినిమాపై చేసిన ట్వీట్ పైనా నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. “నేను ‘డుంకీ’ సినిమా చూడటం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాను సెన్సార్ సభ్యులు ప్రశంసించినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ప్రేక్షకులు మరో అద్భుతమైన సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు” అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ పై ప్రభాస్ అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు. ‘సలార్’ సినిమాను తక్కువ చేసి చూపించినట్లుగా ఈ ట్వీట్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.   


వివరణ ఇచ్చిన వెంకటేష్ మహా  


ఈ విమర్శలపై వెంకటేష్ మహా వివరణ ఇచ్చారు. ‘‘నేను ప్రభాస్‌కి అతడి మొదటి సినిమా నుంచి పెద్ద అభిమానిని. అతడితో కలిసి సినిమా చేయాలని ఉందని చాలాసార్లు చెప్పాను. ‘సలార్‌’ ట్రైలర్‌ విడుదలైందని మీ కామెంట్లు చూశాకే అర్థమైంది. ఇప్పుడే ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. ‘డుంకీ’ మూవీపై నేను పెట్టిన పోస్టును మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాను. కానీ, ప్రభాస్ సినిమాను తక్కువ చేయలేదు. ప్రతి విషయంలో గందరగోళం సృష్టించి వాస్తవాలను తప్పుదారి పట్టించకూడదు. ఇదే విషయాన్ని మీకు గతంలోనూ చెప్పాను” అని రాసుకొచ్చారు.


ట్విట్టర్ అకౌంట్ డీ యాక్టివేట్


ప్రభాస్ అభిమానులకు వివరణ ఇస్తూ పోస్టు పెట్టిన కొద్దిసేపటికే ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ను డీ యాక్టివేట్ చేశారు వెంకటేష్. ‘KGF’ చిత్రాన్నితెరకెక్కించిన ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రభాస్‌, శృతి హాసన్ జంటగా రూపొందిన ఈ సినిమా డిసెంబరు 22న విడుదల కానుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరి రావు ముఖ్యపాత్రలు పోషించారు. అటు షారుక్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ‘డుంకీ’ సినిమా డిసెంబరు 21న విడుదల కానుంది. ఈ చిత్రంలోతాప్సీ పన్ను, విక్కీ కౌశల్, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు.


Read Also: రణబీర్ వీడియో TO దీపిక వావ్‌ - 2023లో బాలీవుడ్ స్టార్స్ టాప్ 10 వైరల్ ఇన్‌స్టా పోస్ట్‌ లు