New COVID Variant JN 1 Symptoms : ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి.. మరోసారి ఇండియాలో విజృభించేస్తుంది. 2020లో ప్రపంచాన్ని ఏ విధంగా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దెబ్బ నుంచి కోలుకుని.. ఇప్పుడిప్పుడే అన్ని నార్మల్​ అవుతున్నాయి. ఈ తరుణంలో నేను ఎక్కడికిపోతాను అన్నట్లు మళ్లీ కరోనా (Corona) వచ్చేసింది. ఇప్పటివరకూ ఎన్నో రకాల వేరియంట్​లు ప్రజలపై ప్రభావం చూపించాయి. అయితే కొవిడ్ జెఎన్​ 1 వేరియంట్ పెద్ద ఎత్తున ప్రజలపై ప్రభావం చూపించనున్నదని WHO హెచ్చరించింది.


ఇండియాలో ఇప్పటికే ఈ వేరియంట్ వచ్చేసింది. కేరళలో ఓ మహిళలో ఈ వేరియంట్​ను గుర్తించారు. ఇది పెద్ద సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నందువల్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ప్రస్తుతం కేరళలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి మిగిలిన రాష్ట్రాలు కూడా అప్రమత్తమవ్వాలని ఆదేశించింది. ఎందుకంటే కొవిడ్ మహమ్మారి ఇతర వేరియంట్లతో పోలిస్తే.. ఈ కొవిడ్ జెఎన్​ 1 వేరియంట్ డిఫరెంట్​గా ఉండడమే ప్రధాన కారణం.


కొవిడ్ జెఎన్​ 1 లక్షణాలివే.. 


కొవిడ్​ జెఎన్​ 1 వేరియంట్​(New COVID variant JN 1)తో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కొవిడ్​ లక్షణాలు ఉంటే.. ఆర్​టీపీసీఆర్​ టెస్టులు చేయించుకోవాలని ఆదేశించింది. మరి కొవిడ్ జెఎన్ 1 లక్షణాలు ఏంటి? అవి కూడా గతం మాదిరి లక్షణాలనే కలిగి ఉన్నాయా? దానిని ఎలా గుర్తించాలనే ప్రశ్నలకు ఇదే సమాధానం. జ్వరం, దగ్గు, అలసట, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, అతిసారం, తలనొప్పులు కొవిడ్ జెఎన్​ 1 లక్షణాలుగా కేంద్రం పేర్కొంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే కొవిడ్ టెస్ట్ చేయించుకుని క్వారంటైన్ చేయాల్సి ఉంటుంది. 


ప్రాణాంతకమైనదా?


జెఎన్​ 1 వేరియంట్ లక్షణాలు లేని ఇన్​ఫెక్షన్​ నుంచి తీవ్రమైన వ్యాధిగా మారి మరణానికి దారి తీస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వేరియంట్​ ద్వారా ప్రభావమైన వారిలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గి.. అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. అయితే కొందరిపై దీని ప్రభావం అంతగా ఉండదని.. తేలికపాటి ఇబ్బందులనే కలిగిస్తుందంటున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై, వృద్ధులపై, మధుమేహం, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలున్నవారిపై ఈ వేరియంట్ బాగా ప్రభావం చూపించే అవకాశముంది. 


ఈ వేరియంట్ కేవలం భారత్​లోనే కాకుండా.. పలు దేశాలలో కూడా పెద్ద ఎత్తున విజృంభిస్తుంది. కాబట్టి ప్రయాణికులు కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తే మంచిది. పండుగల సీజన్​లలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలు చేసే సమయంలో కొవిడ్ రూల్స్ పాటిస్తే కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. నియమాలు పాటించకుండా వైరస్​ను వృద్ధి చేస్తే.. గతంలోని పరిస్థితులు మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరింతటా వారే.. కొవిడ్ నియమాలు పాటిస్తే అందరికీ మంచిది. 












గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.