'సంధ్యారాజు' తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మందికి తెలిసిన పేరు. కళాకారులకు మాత్రం ఆమె కూచిపూడి నృత్యకారిణి అని తెలుసు. మిగిలిన వారికి  ‘నాట్యం’ సినిమా ద్వారా పరిచయమవుతోన్న హీరోయిన్ అని మాత్రమే తెలుసు. కానీ సంధ్యారాజు బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఓ గొప్పింటి కూతురు..మరో ప్రముఖ వ్యక్తి కోడలు సంధ్యారాజు. ఆమె నటించిన ‘నాట్యం’ సినిమా టీజర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్,  ట్రైలర్‌ను రామ్‌చరణ్‌, ఓ సాంగ్ ను బాలకృష్ణ, ఓ సాంగ్ ను వెంకటేశ్ విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి అయితే సినిమాను ఓ రేంజ్ లో ఆకాశానికెత్తేశారు. కే విశ్వనాథ్ ను స్ఫూర్తిగా తీసుకునే ఈ సినిమాను తీసినట్టు అనిపిస్తోందని..యంగ్ డైరెక్టర్ అయిన రేవంత్  ఇలాంటి ప్రయత్నం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.  ఇలాంటి వారు రావాలి అన్నారు చిరంజీవి.  ఇంకా ఈ మూవీని పలువురు సెలబ్రెటీలు ప్రమోట్ చేయడంతో ఈమె ఎవరనే ప్రశ్న చాలా మందిలో తలెత్తింది.  



ఇంతకీ ఎవరీమే అంటే వేల కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలకు వారసురాలు, రాంకో సిమెంట్ ఇండస్ట్రీస్ యజమాని అయిన పి.ఆర్.వెంకట రామ రాజు  పెద్ద కుమార్తె  సంధ్య రాజు. కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చిన సత్యం గారి శిష్యురాలు. మరో ఆసక్తికరమైన  విషయం ఏంటంటే  ఐ.టి. పరిశ్రమ మన తెలుగు నెల మీద వేళ్లూనుకోవటానికి కారకులయిన సత్యం రామలింగ రాజు చిన్న కోడలు. పేరున్న కుటుంబం నుంచి వచ్చినా గొప్ప కుటుంబంలో అడుగుపెట్టినా  సంధ్యా రాజు కూచిపూడి డాన్సర్‌గానే చాలా మందికి తెలుసు. తన నృత్యం ద్వారానే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆమె నర్తించిన ‘కృష్ణ శబ్దం’ అనే వీడియోకు యూట్యూబ్‌లో 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక కూచిపూడి నర్తకి వీడియోకి ఈ స్థాయిలో వ్యూస్ రావడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. 



చిన్నప్పటినుంచి సంధ్యారాజుకి నాట్యంపై ఆసక్తి ఉండేది. ఓ సారి బెంగళూరు లో వెంపటి చినసత్యం ‘క్షీరసారగమథనం’ చూసిన తర్వాత తాను కూడా  నాట్యం నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యారు. నాట్యం పై కుమార్తె ఆసక్తి గమనించిన సంధ్యా తల్లి ఆమెను మద్రాసులో వాళ్లింటికి దగ్గరగా ఉండే చినసత్యంగారి అకాడమీకిలో చేర్పించి శిక్షణ ఇప్పించారు. అప్పటినుంచి ఆమెకు నాట్యమే ప్రపంచమైపోయింది. స్కూల్ పూర్తైన వెంటనే  గురువు గారిదగ్గర నాట్యం ప్రాక్టీస్ చేయడమే తన పనిగా మారిపోయింది. అలా  కూచిపూడి నాట్యం లో ప్రావీణ్యత సంపాదించుకుని ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. నాట్య ప్రదర్శనలు ఇస్తున్నప్పుడే చాలామంది సంధ్యారాజు హావభావాలు చూసి మోడలింగ్ చేస్తారా అని అడిగేవారట.ఆ తర్వాత  తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం లో ‘జునూన్‌’ అనే లఘు చిత్రం లో కూడా నటించారామె. ఇప్పటికీ  తన తాతగారు అయిన  రామ్‌కో వ్యవస్థాపకులు పీఆర్‌ రామస్వామిరాజుగారి జయంతికి తమిళనాడు లో సొంతూరు కు వెళ్లి నృత్య ప్రదర్శన ఇస్తారట సంధ్యారాజు. 



కూచిపూడి డాన్సర్‌గానే కాకుండా టాలీవుడ్‌లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసిన సంధ్యా రాజు  'నాట్యం' సినిమాతో తనలో నటిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. కొత్త దర్శకుడు రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో రూపొందిన ‘నాట్యం’ సినిమాలో సంధ్యా రాజు ప్రధాన పాత్ర పోషించారు.  శాస్త్రీయ నృత్యం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో కేవలం నృత్యం మాత్రమే కాదు  అంతకు మించిన బంధాలు, భావోద్వేగాలు ఉంటాయని చెప్పారు సంధ్య. ఒక విద్యార్థినికి, గురువుకి మధ్య ఉన్న అందమైన అనుబంధం.. నర్తకి కావాలనే ఆమె తపన, ఎదురైన అడ్డంకులు ఈ సినిమాలో చూపించామన్నారు. తాను సినిమాల్లో నటిస్తానని, తన జీవితంలో సినిమా భాగం అవుతుందని ఏనాడూ అనుకోలేదన్న ఆమె తాను నటిగా రావడానకి కారణం తన గురువు పద్మభూషణ్ వేంపతి చిన్న సత్యం వద్ద నాట్యం నేర్చుకున్న ప్రముఖ నటులని అన్నారు. చిన్న సత్యం వద్ద ఎన్టీఆర్, హేమమాలిని, భానుప్రియ, జయలలిత సహా ఎందరో ప్రముఖ నటీనటులు నృత్య పాఠాలు నేర్చుకున్నారు. అందుకే నటన అనేది నృత్యానికి కొనసాగింపు అని తాను గ్రహించానని సంధ్య చెప్పుకొచ్చారు.


నాట్యంపై  అభిరుచితోనే 'నాట్యం' సినిమాలో నటించేందుకు ఒప్పుకున్న సంధ్యారాజు  ఈ మూవీ కాన్సెప్ట్ నచ్చడంతో నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కు నృత్య దర్శకత్వం కూడా సంధ్యా రాజు చేస్తున్నారు. కుటుంబంలో అందరు పారిశ్రామిక వేత్తలే అయినప్పటికీ..నాట్యాన్ని నమ్ముకుని కళాకారిణిగా ఆమె ఇంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె భర్త రామరాజు సైతం ఆమెను ప్రోత్సహిస్తూ, ఆమెను చూసి గర్వ పడుతుండడం విశేషం. తాను నటిని అవుతానంటే ఇంట్లో ఎవరూ అడ్డుచెప్పలేదని..ప్రోత్సహించారని చెప్పారు సంధ్యారాజు. సత్యం రామలింగరాజు రెండో కుమారుడు రామరాజును 2007లో పెళ్లిచేసుకున్నారు సంధ్య.


'నాట్యం' సినిమా గురించి చిరంజీవి ఏమన్నారో ఇక్కడ చూడండి..






నాట్యం టీజర్ విడుదల చేసిన ఎన్టీఆర్






'నాట్యం' మూవీలో ఓ నమఃశివాయ పాటను లాంచ్ చేసిన బాలకృష్ణ






నాట్యం మూవీలో వెంకటేశ్ విడుదల చేసిన సాంగ్






 నాట్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ ఏమన్నారంటే...