ఈ మధ్యకాలంలో థియేటర్లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాల్లో 'డీజే టిల్లు' ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాతో హీరో సిద్ధూ రేంజ్ పెరిగిపోయింది. దీంతో తాను ఒప్పుకున్న వేరే సినిమాలను వదులుకొని మరీ 'డీజే టిల్లు' సినిమాకి సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్నారు సిద్ధూ జొన్నలగడ్డ. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేశారు. కొన్నిరోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ స్వయంగా వెల్లడించారు. 


ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. సీక్వెల్ కథలో కొన్ని మార్పులు చేశారు. ఇందులో భాగంగా హీరోయిన్ రాధికా క్యారెక్టర్ ని లేపేశారట. ఈ పాత్రలో నేహా శెట్టి నటించింది. నిజానికి టిల్లు క్యారెక్టర్ అంత ఎలివేట్ అవ్వడానికి ఒకరకంగా రాధికా క్యారెక్టర్ కూడా ఒక కారణం. సినిమాలో టిల్లు.. రాధికాను పిలుస్తూ చెప్పే డైలాగ్స్, ఆ క్యారెక్టర్ ను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. 


అలాంటిది ఇప్పుడు సీక్వెల్ లో అసలు రాధికా క్యారెక్టర్ ఉండదని సమాచారం. అతిథి పాత్రలో అలా మెరిసి మాయమైపోతుందట. 'డీజే టిల్లు2'లో ఓ గ్లామరస్ హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతం హీరోయిన్ కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఇక పార్ట్ 1లో వచ్చిన కొన్ని పాత్రలు పార్ట్ 2లో కూడా కంటిన్యూ అవుతాయి. అలానే మరికొన్ని కొత్త పాత్రలను యాడ్ చేయబోతున్నారు. 


ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాకి సిద్ధూ జొన్నలగడ్డ డైరెక్టర్ గా వ్యవహరిస్తారట. ఫస్ట్ పార్ట్ ను డైరెక్ట్ చేసిన విమల్ కృష్ణనే దర్శకుడిగా కొనసాగించాలని అనుకున్నప్పటికీ.. అతడికి వేరే కమిట్మెంట్స్ ఉండడంతో అతడు ఈ ప్రాజెక్ట్ చేయలేకపోతున్నాడని సమాచారం. దీంతో సిద్ధూ ఈ బాధ్యతలను చేపడుతున్నాడని టాక్. దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.